అర్షా స్కూల్లో రన్ ఫర్ పీస్
కుషాయిగూడ, జూన్ 7 (విజయక్రాంతి): ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధాలు, హింసాత్మక ఘటనలు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి, ఐక్యత, సామాజిక సామరస్యాన్ని చాటిచెప్పే లక్ష్యంతో అర్షా స్కూల్ ఆఫ్ లెర్నింగ్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘రన్ ఫర్ పీస్‘ కార్యక్రమం విజయవంతమైంది. సైనిక్‌పురి పరిసర ప్రాంతాల ఉత్తర-తూర్పు కాలనీలకు చెందిన విద్యార్థులు, యువత, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
‘యుద్ధం వద్దు - ద్వేషం వద్దు - ఉగ్రవాదం వద్దు’ అనే నినాదంతో నిర్వహించిన ఐదు కిలోమీటర్ల శాంతి పరుగును జవహర్నగర్ డివిజన్ ఏసీపీ ఎస్. చక్రపాణి, హైకోర్టు న్యాయవాది, సామాజిక కార్యకర్త నరేష్ సుంకర, అర్షా స్కూల్ డైరెక్టర్ సాయి ఫణేంద్ర, ప్రిన్సిపల్ చిత్రా ఎం. భట్ జెండా ఊపి ప్రారంభించారు.
అర్షా స్కూల్ ప్రాంగణం నుంచి ప్రారంభమైన పరుగు పరిసర కాలనీల మీదుగా సాగి.. తిరిగి పాఠశాల వద్ద ముగిసింది. ఉత్సాహంగా పరుగెత్తుతూ ‘భవిష్యత్తు సైరన్లతో కాదు... పిల్లల నవ్వులతో మార్మోగాలి’ అనే సందేశాన్ని సమాజానికి చేరవేశారు. శాంతియుత, ఆరోగ్యవంతమైన, సామరస్యపూరిత సమాజ నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేశారు.






