ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదు
మహబూబ్నగర్ అర్బన్, జూన్ 7: పదేళ్లు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తి చేయలేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 4, 5 తేదీలలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను సందర్శించి సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో మహబూబ్నగర్ జిల్లా డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని నమ్మించి, కరివెన, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను పదేళ్లు పెండింగ్లో పెట్టింది మీ ప్రభుత్వం కాదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి కట్టుబడి ఉంటే, మీకు ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు. జిల్లాకు మంచి జరుగుతుంటే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు అర్థం కావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్, డీసీసీ జనరల్ సెక్రటరీ రాములు యాదవ్, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ పసుల రాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అక్బర్, ఇతర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






