రికార్డు కనిష్ఠం వద్ద ముగిసిన రూపాయి
83.5౯ స్థాయికి కరెన్సీ
ముంబై, జూన్ 11: గతవారాంతంలో స్వల్పంగా కోలుకున్న రూపాయి వరుసగా సోమ, మంగళవారాల్లో క్షీణించి రికార్డు కనిష్ఠస్థాయి వద్ద ముగిసింది. మంగళవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో డాలరు మారకంలో రూపాయి విలువ ఇంట్రాడే కనిష్ఠం 83.5౯ వద్దకు పడిపోయింది. ప్రొవిజినల్ ముగింపు ౮౩.౫౬ వద్ద ఉన్నప్పటికీ చివరకు క్రితం రోజుతో పోలిస్తే ౯ పైసలు నష్టపోయి ౮౩.౫౯ రికార్డు కనిష్ఠస్థాయి వద్ద ముగిసింది. ఏప్రిల్ నెలలో కనపర్చిన 83.5750 రికార్డు కనిష్ఠస్థాయి నుంచి కొద్ది రోజులపాటు రిజర్వ్‌బ్యాంక్ జోక్యంతో కొంతవరకూ కోలుకున్న రూపాయి తిరిగి ఆ స్థాయికి పడిపోయింది.
అయితే కేంద్ర బ్యాంక్ డాలర్ల అమ్మకం ద్వారా తీవ్ర పతనాన్ని నిరోధించిందని ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. మంగళవారం డాలర్ ఇండెక్స్ 105.2 వద్దకు చేరడంతో పలు ఆసియా కరెన్సీలు సైతం క్షీణించాయని ట్రేడర్లు తెలిపారు. బుధవారం వెల్లడయ్యే ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం కోసం మార్కెట్ వేచిచూస్తున్నదని, వడ్డీ రేట్లు యథాతథంగా అట్టిపెడుతుందన్న అంచనాలు ఉన్నప్పటికీ, ఫెడ్ చైర్మన్ జెరోమ్ పొవెల్ వెల్లడించే సంకేతాలు, వడ్డీ రేట్ల డాట్ ప్లాట్ కీలకమని ఫారెక్స్ ట్రేడర్లు వివరించారు.






