30 March, 2026 | 2:37 AM

రష్యా ఉస్త్‌లుగా నౌకాశ్రయంపై దాడి

30-03-2026 12:51 AM
  1. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో తీవ్రంగా దెబ్బతిన్న ఓడరేవు

భారత్‌కు ఇంధనం రవాణాచేసే పోర్టుల్లో ఉస్త్‌లుగా కీలకం

మాస్కో, మార్చి 29: రష్యా చమురు ఎగుమతుల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఉస్త్‌లుగా నౌకాశ్రయాన్ని ఉక్రెయిన్ డ్రోన్లు తీవ్రంగా దెబ్బతీశాయి. వారం క్రితం జరిగిన దాడిలో ఈ పోర్టు కొంత మేర ధ్వంసం కావడంతో.. ఇప్పటికే ఎగుమతులను నిలిపివేశారు. తాజాగా ఈ పోర్టుపై ఆదివారం మరోసారి ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుప డింది. ఈ విషయాన్ని లెనిన్రాడ్ ప్రాంత గవర్నర్ కూడా ధ్రువీకరించారు.

అప్పటికీ తాము 31 డ్రోన్లను కూల్చినట్లు పేర్కొన్నారు. రష్యా నుంచి భారత్‌కు ఇంధనం సరఫరా చేసే పోర్టుల్లో ఉస్త్‌లుగా పోర్టు కూడా కీలకమైంది. బాల్టిక్ సముద్ర ప్రాంతంలో రష్యా ఎగుమతులకు ఈ పోర్టు చాలా కీలకం. ఐరోపా, ఆసియా దేశాలకు ఇక్కడి నుంచే అధిక మొత్తంలో చమురు, గ్యాస్ సరఫరా అవుతాయి. ఉక్రెయిన్ ప్రయోగించిన సుదూర శ్రేణి డ్రోన్లు రష్యా గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని, నేరుగా గ్యాస్ నిల్వ ట్యాంకర్లను ఢీకొట్టాయి.

దీంతో అక్కడ పెద్ద ఎత్తున అగ్నిప్రమాదం సంభవించి, కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే ఇదే ప్రాంతంలోని ప్రిమోర్క్ పోర్టు కూడా ఇటీవల ఉక్రెయిన్ దాడుల్లో బాగా దెబ్బతింది. సముద్ర మార్గంలో రష్యా చేసే చమురు ఎగుమతుల్లో 45% వరకు ఇక్కడి నుంచే ఉంటుంది. ఇక్కడి నుంచి రోజుకు సుమారు 1.72 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఎగుమతి అవుతుంది.

ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనడంతో.. ధరలు భారీగా పెరిగాయి. ఈ సమయంలో రష్యా లోటు బడ్జెట్‌ను పూరించుకొనేందుకు అవకాశం దొరికింది. కానీ, తాజా దాడితో రష్యా చమురు ఆదాయానికి భారీగా గండి పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్ కూడా రష్యా ఇంధన పరిశ్రమపైనే గురిపెట్టింది. ఈ నెలలో పలు ఇంధన సంస్థలపై 10 భారీ దాడులు చేసింది.