16 July, 2026 | 12:44 AM

గిరిజనులకు మెగా జాబ్ మేళా

16-07-2026 12:33 AM

- యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యం

- ఐటీడీఏ పీఓ మకరందు

ఉట్నూర్, జూలై 15 : గిరిజన, గ్రామీణ ప్రాంతాల నిరుద్యోగ యువతకు ప్రైవేట్ రంగంలో మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి (పీఓ) మంద మకరందు అన్నారు.

బుధవారం ఉట్నూర్ లోని కుమ్రంభీం కాంప్లెక్స్ ప్రాంగణంలో ఉన్న యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ)లో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాను ప్రారంభించిన అనంతరం యువతనుద్దేశించి మాట్లాడారు. గిరిజన యువత విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకుని ప్రైవేట్ రంగంలో లభిస్తున్న ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఐటీడీఏ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పించేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని మెగా జాబ్ మేళాలను నిర్వహించి ఎక్కువ మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఈ మెగా జాబ్ మేళాలో దేశంలోని ప్రముఖ 20 కార్పొరేట్ సంస్థలు పాల్గొన్నాయి.

ఆయా సంస్థల హెచ్.ఆర్. ప్రతినిధులు అభ్యర్థులకు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించి వారి విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవాన్ని పరిశీలించి ఉద్యోగాలకు ఎంపిక చేయగా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు, జేడీఎం మేనేజర్ నాగభూషణం, ఇతర అధికారులు అక్కడికక్కడే నియామక పత్రాలు (ఆఫర్ లెటర్లు) అందజేశారు. ఈ జాబ్ మేళాలో ఏపీఓ (జనరల్) వసంతరావు, డీడీ ప్రేమకల, ఏపీఓ (పీవీటీజీ) ఆత్రం భాస్కర్, డీఎంజీ సందీప్ కుమార్, అడిషనల్ డిఎంహెచ్‌ఓ మెస్రం మనోహర్, ఈఈ తానాజీ, డిప్యూటీ డీఈవో చందన్, పేసా కోఆర్డినేటర్ వసంతరావు, వివిధ శాఖల అధికారులు, యూత్ ట్రైనింగ్ సెంటర్ సిబ్బంది, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.