- క్వార్టర్స్‌లో జెంగ్‌పై విజయం
- బోపన్న జోడీ ఓటమి
- యూఎస్ ఓపెన్
ప్రతిష్టాత్మక యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మరింత రసవత్తరంగా మారుతోంది. ఫేవరెట్ అనుకున్నోళ్లంతా ఇంటిబాట పట్టడంతో ఈసారి టైటిల్ ఎవరి సొంతమవుతుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళల క్వార్టర్స్‌లో అరీనా సబలెంకా సెమీస్‌కు చేరగా.. గాఫ్‌కు షాకిచ్చిన నవ్వారో తన జోరును కొనసాగిస్తూ టైటిల్ వేటలో వేగంగా దూసుకెళ్తోంది. ఇక పురుషుల క్వార్టర్స్‌లో జ్వెరెవ్‌కు ఫ్రిట్జ్ షాకివ్వగా.. టియాఫోకు వాకోవర్ లభించింది.
న్యూయార్క్: సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్‌లో బెలారస్ స్టార్ అరీనా సబలెంకా సెమీస్‌లో అడుగుపెట్టింది. బుధవారం మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సబలెంకా 6-1, 6-2 తేడాతో జెంగ్ (చైనా) మీద సునాయస విజయం సాధించింది. కేవలం గంటా 13 నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్ ముగియడం గమనార్హం. జెంగ్ మీద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన సబలెంకా 16 విన్నర్లు సంధించింది. కాగా జెంగ్ 20 అనవసర తప్పిదాలతో ఓటమిని మూటగట్టుకుని టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మరో క్వార్టర్ ఫైనల్లో అమెరికా యువసంచలనం ఎమ్మా నవ్వారో 6-2, 7-5 తేడాతో బడోసా (స్పెయిన్) మీద విజ యం సాధించి సగర్వంగా సెమీస్‌లో అడుగుపెట్టింది. వరుస సెట్లలో విజయం సాధించిన నవ్వారో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. 4 ఏస్‌లు సంధించిన బడోసా 35 అనవసర తప్పిదాలు, 7 డబుల్ ఫాల్ట్స్‌తో మూల్యం చెల్లించుకొని టోర్నీ నుంచి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. ఇక పురుషుల సింగిల్స్‌లో నాలుగో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు ఊహించని షాక్ తగిలింది. టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా) 7-6 (7/2), 3-6, 6-4, 7-6 (7/3) తేడాతో జ్వెరెవ్ (జర్మనీ)పై విజయం సాధించాడు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో జ్వెరెవ్‌ను ఓడించేందుకు టేలర్ చెమటోడ్చాల్సి వచ్చింది.
మ్యాచ్‌లో టేలర్ కంటే మెరుగైన ప్రదర్శన కనబరిచినప్పటికీ జ్వెరెవ్ ఓటమి పాలవ్వడం గమనార్హం. 14 ఏస్‌లతో పాటు 52 విన్నర్లు కొట్టిన జ్వెరెవ్ 42 అనవసర తప్పిదాలు చేశాడు. మరోవైపు 12 ఏస్‌లు సంధించిన టేలర్ 5 డబుల్ ఫాల్ట్స్, 48 అనవసర తప్పిదాలు చేయడం విశేషం. 9వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా) గాయంతో వైదొలగడంతో అమెరికాకు చెందిన టియాఫోకు సెమీస్‌కు వాకోవర్ లభించింది.
బోపన్న జోడీ ఓటమి
యూఎస్ ఓపెన్‌లో భారత్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న పోరాటం ముగిసింది. యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో రోహన్ బోపనెే్నసుత్జియాది (ఇండోనేషియా) జోడీ 6-3, 6-4 తేడాతో అన్‌సీడెడ్ టౌన్‌స్వెండ్‌ొోయంగ్ (అమెరికా) ద్వయం మీద వరుస సెట్లలో పరాజయం పాలయింది. కాగా ఇప్పటికే పురుషుల డబుల్స్‌లో ఓటమిపాలైన బోపన్న ఈ ఓటమితో టోర్నీ నుంచి రిక్త హస్తాలతో వెనుదిరిగాడు.