పీహెచ్‌సీలో గర్భిణికి సురక్షిత ప్రసవం
సూర్యాపేట,సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ఆత్మకూర్(ఎస్) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre)లో వైద్యులు శస్త్రచికిత్స లేకుండానే సాధారణ ప్రసవం చేసి మాతృత్వపు తీపిని అందించారు. అదే గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి గురువారం తీవ్ర నొప్పులతో ఆసుపత్రిలో చేరగా, విధి నిర్వహణలో ఉన్న డాక్టర్ రమ్య తన వైద్య బృందంతో కలిసి సురక్షితంగా కాన్పు నిర్వహించారు. ఈ ప్రసవంలో భాగ్యలక్ష్మి ఆరోగ్యవంతమైన మగబిడ్డకు జన్మనివ్వగా, ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
సకాలంలో స్పందించి ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించిన డాక్టర్ రమ్య, నర్సింగ్ ఆఫీసర్ మానస, ఆరోగ్య కార్యకర్తలు మహబూబా, అన్నపూర్ణ, మాధవి, యాదగిరి, కొండా శ్రీనుల బృందాన్ని బాధితురాలి కుటుంబ సభ్యులు, స్థానికులు అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన వైద్య సేవలను గర్భిణులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి వర్గాలు కోరాయి.