calender_icon.png 6 December, 2025 | 1:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏప్రిల్ నుంచి రెండో విడత..

06-12-2025 12:56:08 AM

  1. ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం
  2. త్వరలో అర్బన్ హౌసింగ్ పాలసీ
  3. ఓఆర్‌ఆర్ చుట్టూ మధ్యతరగతి ప్రజలకు ఇండ్లు
  4. మార్చిలోగా లక్ష, జూన్ నాటికి రెండు లక్షల గృహప్రవేశాలు
  5. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 5 (విజయక్రాంతి): ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటివరకు దాదాపు నాలుగు లక్షల ఇండ్లను మంజూరు చేశామని, మూడు లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి లక్ష ఇందిరమ్మ ఇండ్లకు గృహ ప్రవేశాలు చేస్తామని, ఆ తర్వాత జూన్ నాటికి మరో రెండు లక్షల గృహ ప్రవేశాలు జరుగుతాయని ప్రకటించారు.

రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం తన ఛాంబర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. జిహెచ్‌ఎంసీతో సహా అన్ని పట్టణాలు, నగరాల్లో పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం మంజూరుకు ప్రణాళిక సిద్ధమైందని, జి ప్లస్ త్రీ పద్ధతిలో నిర్మించే గృహాల కోసం అతి కొద్ది రోజుల్లో పాలసీని ప్రకటించబోతున్నామని తెలిపారు. ఒక్కో చోట 8 నుంచి 10 వేల ఇండ్లు నిర్మిస్తామన్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 2 డబుల్ ఇండ్ల నిర్మాణాన్ని రూ.700 కోట్లతో పూర్తి చేశామని, రూ.200 కోట్లతో ఆయా కాలనీకు మౌళిక వసతులు కల్పించామన్నారు.

హౌసింగ్ బోర్డు పరిధిలో లీజుకు తీసుకున్నలేదా కబ్జా అయిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్పారు.  గత ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖను పూర్తిగా రద్దు చేసిందని, పేదలకు పక్కా ఇండ్లు నిర్మించాలన్న ఆలోచనతో తిరిగి గృహ నిర్మాణ శాఖను పునరుద్దరించామని తెలిపారు. ఎల్బీనగర్‌లో సిరీస్ ఫ్యాక్టరీ భూములను రెసిడెన్షియల్ జోన్‌గా మార్చింది కేటీఆరేనని పొంగులేటి విమర్శించారు. హిల్ట్ పాలసీలో రెండు అంశాలు బీఆర్‌ఎస్ హయాంలో వచ్చినవేనని, ఆ ఫైల్‌పై కేటీఆర్ సంతకం చేశారని మంత్రి పొంగులేటి వివరించారు.