అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల వేతనాలు పెంచాలి
మహబూబాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు నెలకు 18 వేల వేతనం, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, రాష్ట్ర బడ్జెట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని, అంగన్వాడీల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ సిఐటియు, అంగన్వాడి సంఘం నాయకులు మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ కు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు సమ్మెట రాజమౌళి, స్నేహ బిందు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 70 వేల మంది అంగన్వాడి టీచర్స్, హెల్పర్స్ 50 సంవత్సరాల నుండి పేద ప్రజలకు సేవలు అందిస్తున్నారని, నేటికీ వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అంగన్వాడి టీచర్స్ కు హెల్పర్స్ కు 18000 వేతనం, పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందని విమర్శించారు.
వెంటనే 2026 ఎడ్యుకేషన్ పాలసీని సవరించాలని, ఫ్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడి కేంద్రాలలోనే నిర్వహించాలని, మార్చి 16 నుండి ఒక పూట బడిని నిర్వహించాలని, టీచర్స్ ,హెల్పర్స్ ఇద్దరికీ ఒకేసారి మే నెల అంతా సెలవులు ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్స్ ను ఈనెల 16న జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు మల్లికాంబ, దుర్గా, కనక లక్ష్మి, సరస్వతి, కొమరమ్మ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.




