16 March, 2026 | 9:44 AM

జనాభా గణన సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలి

16-03-2026 12:00 AM
  1. దేశ అభివృద్ధిలో జనాభా లెక్కలు కీలకపాత్ర పోషిస్తాయి

ప్రతి ఇంటిని సందర్శించి సరైన సమాచారం నమోదు చేయాలి

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్

ములుగు,మార్చి15(విజయక్రాంతి):దేశ అభివృద్ధిలో ప్రత్యేక ప్రణాళికలు రచించడంలో ప్రభుత్వ పథకాలను రూపొందించడంలో జనాభా లెక్కలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని 2027 జనాభా లెక్కలు కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. అన్నారు ఆదివారం ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ’2027 జనాభా’ లెక్కలలో భాగంగా 2026 మే 11వ తేదీ నుండి 2026 జూన్ 9వ తేదీ వరకు జరిగే ’పేజ్ 1 హౌస్ లిస్టింగ్ &హౌసింగ్ సెన్సెస్ నిర్వహణపై జిల్లా,మండల,మున్సిపల్ స్థాయి అధికారులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో జనాభా లెక్కలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు. ఖచ్చితమైన గణాంకాలు ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి తోడ్పడతాయన్నారు.జనాభా గణన ప్రాథమిక వనరు అని,హౌస్ లిస్టింగ్,హౌసింగ్ సెన్సెస్ ప్రక్రియలో ఇంటి నిర్మాణం, నివాస పరిస్థితులు,కుటుంబ వివరాలు,మౌలిక సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు.

మొదటి దశలో నిర్వహించబడే ఇళ్ల జాబితా మరియు గృహాల గణనలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించిన పదార్థాలు,ఇంటి పరిస్థితి,కుటుంబ యజమాని వివరాలు,త్రాగునీటి సౌకర్యం,మురుగునీటి పారుదల వ్యవస్థ, మరుగుదొడ్ల లభ్యత,వంటగది సౌకర్యం వంటి వివరాలతో పాటు రేడియో,టెలివిజన్, స్మార్ట్ఫోన్,కంప్యూటర్,సైకిల్,కారు వంటి గృహ సౌకర్యాలకు సంబంధించిన మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి సేకరించే విధానాన్ని ఈ శిక్షణలో వివరించనున్నట్లు తెలిపారు.