3 August, 2026 | 10:10 AM

పుట్టగొడుగుల్లా దర్శనమిస్తున్న బెల్ట్ షాపులు.. ఏరులై పారుతున్న మద్యం

03-08-2026 08:50 AM

తెల్లవారకముందే మద్యం అమ్మకాలు

మహిళలు, యువతకు తీవ్ర ఇబ్బందులు...

అక్రమ బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్...

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని మద్యం ఏరులై పారుతుంది. ఎటు చూసిన బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా దర్శనమిస్తున్నాయి.అధికారుల నిర్లక్ష్యం వలన మద్యం మాఫియా గల్లీకో బెల్ట్ షాపు ఏర్పాటు చేస్తూ అందినకాడికి దండుకుంటుంది.  నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని ప్రగతి నగర్ వార్డులో గల సైదప్ప బస్తీలో అక్రమ బెల్ట్ షాపులు రాజ్యమేలుతున్నాయని స్థానికులు  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేణుక ఎల్లమ్మ ఆలయం వెనుక భాగంలో, ఎదురుగా ఉన్న ప్రాంతాల్లో బెల్ట్ షాపులను ప్రతిరోజూ తెల్లవారకముందే తెరిచి అర్ధరాత్రి వరకు ఎలాంటి నియంత్రణ లేకుండా నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

స్థానికంగా రెండు చోట్ల, సమీప ప్రాంతంలో మరోచోట అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని, దీనివల్ల బస్తీ వాతావరణం పూర్తిగా దెబ్బతింటోందని ప్రజలు వాపోతున్నారు. రోజువారీ కూలీలు, నిరుపేద కుటుంబాలకు చెందిన పలువురు మద్యానికి బానిసలుగా మారి అధికంగా మద్యం సేవిస్తూ రోడ్లపైనే పడిపోతున్నారని తెలిపారు. మద్యం సేవించిన మందుబాబులు రోడ్లపై వెళ్లే ఒంటరి మహిళలు, యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం నిత్యకృత్యంగా మారిందని స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, విద్యార్థులు కూడా ఈ పరిస్థితుల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.

అక్రమ బెల్ట్ షాపుల నిర్వహణతో సైదప్ప బస్తీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయని, రాత్రి వేళల్లో గొడవలు, గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు తెలిసీ తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పోలీసు శాఖ, అబ్కారీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సైదప్ప బస్తీలో కొనసాగుతున్న అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని, బెల్ట్ షాపులను తక్షణమే సీజ్ చేసి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల ప్రశాంత జీవనానికి భంగం కలిగిస్తున్న ఈ అక్రమ వ్యాపారంపై అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.