17 April, 2026 | 6:03 PM

ఉప్పుతో ముప్పే అధికం

18-05-2025 12:00 AM

అందరికీ తెలిసింది. అందరూ చెప్పుకొనేది బీపీ పెరుగుతుందని. ఆ మాట నిజమే. ఉప్పు ఎక్కువగా తింటున్న కొద్దీ హైబీపీ ముప్పు పెరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా హైబీపీ, దాని కారణంగా వచ్చే గుండె జబ్బులు, పక్షవాతాల్లో 17-30 శాతం వరకూ కేవలం అధిక ఉప్పు కారణంగానే వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మరోవైపు రోజుకు మూడు గ్రాముల కంటే ఉప్పు తక్కువగా తింటున్నవారిలో హైబీపీ సమస్య చాలా తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

అసలు ఉప్పు అంటే ఏమిటో తెలియని గిరిజన తెగల్లో అధిక రక్తపోటు ముప్పే కనబడకపోవడటం విశేషం. సాధారణంగా వయసుతో పాటు బీపీ కొంత పెరుగుతుందని భావిస్తుంటారు. కానీ ఉప్పు తక్కువగా తింటున్న వారిలో అదీ లేదు. అలాగని ఉప్పుతో హైబీపీ, గుండె జబ్బుల ముప్పు ఒక్కటే వస్తాయని అనుకోవడం తప్పు. ఉప్పు అధికంగా తినడం వల్ల జీర్ణాశయం, పేగుల్లోని మృదు చర్మం దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉన్నది.

ఉప్పు పెరుగుతున్న కొద్దీ ఊబకాయం, మూత్రపిండాల్లో రాళ్లు, ఉబ్బసం వంటి సమస్యలు వస్తాయి. ఉప్పు రుచి అనేది మనం అలవాటు చేసుకుంటే వచ్చేది. ఇంతే ఉప్పు తినాలి. అంత తింటేనే రుచి అనేం లేదు. మనం ఎంత ఉప్పు తినడానికి అలవాటు పడితే.. అదే రుచి. కాబట్టి సాధ్యమైనంత తక్కువ ఉప్పు తినటం అలవాటు చేసుకోవడం ఉత్తమం. పిల్లలకు చిన్నతనం నుంచే తక్కువ ఉప్పు తినటం అలవాటు చెయ్యాలి.