1 August, 2026 | 7:56 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి అండగా తెలుగుదేశం పార్టీ   •   జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా...   •   రైల్వే కార్మికుల హక్కుల కోసం మజ్దూర్ యూనియన్ నిరంతరం పోరాటం   •   పాదాచారులకు రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణపై సూచనలు   •   ఎదురెదురుగా రెండు బైకులు ఢీ.. ఒకరికి తీవ్ర గాయాలు   •   ట్రాఫిక్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలి   •   సిద్ధార్థ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఘనంగా వన మహోత్సవం   •   ఎస్సీ బాలుర వసతి గృహాన్ని తనిఖీ చేసిన ఎంపీడీవో.   •   ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తికి 6 వేల జరిమానా   •   ఉన్నత పాఠశాలను సందర్శించిన డిఇఓ   •  

వికారాబాద్‌లో ఎల్‌ఆర్‌ఎస్‌కు మోక్షం

24-08-2024 02:49 AM
  1. నాలుగు మున్సిపాలిటీల్లో 20 వేల దరఖాప్తులు 
  2. గ్రామ పంచాయతీల్లో 12,745.. 
  3. క్రమబద్ధీకరణకు తీసభ్య కమిటీ

వికారాబాద్, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఎల్‌ఆర్‌ఎస్ కోసం చాలామంది ప్రజలు నాలుగు ఏళ్లుగా ఎదరుచూస్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వేల సంఖ్యలో దరఖాస్తులు పెడింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్లాట్ల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపడంతో అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎల్‌ఆర్‌ఎస్ పెడింగ్ దర ఖాస్తులను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో త్రిసభ్య కమిటీని నియమించి, నాలుగు రోజుల క్రితం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, ఆర్‌ఐలకు ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలనపై శిక్షణ సైతం ఇచ్చారు. ప్లాట్ల క్రమబద్ధీకరణలో ఎలాంటి పొరపాట్లు జరుగకుండా, గతంలో అనుసరించిన విధానాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు కొత్త అంశాలను పరిశీలిస్తూ ముందు కు వెళ్లాలని కలెక్టర్ ప్రతీక్‌జైన్, అధికారులు సిబ్బందికి సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌తో జిల్లాలో సుమారు దాదాపు 35 వేల మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 

ఎక్కువగా కచ్చ లే అవుట్లే..

అనుమతులు లేని వెంచర్ల నిలుపుదలకు ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా  సాధ్యపడటం లేదు. మున్సిపల్, గ్రామ పంచాయ తీల్లో ఎక్కడో ఒకచోట కచ్చ లేఅవట్లు అవుతూనే ఉన్నాయి. కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు డీటీసీపీ అనుమతులు లేకుం డా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో వెంచర్లు వేసి ప్లాట్లను అమ్ముతున్నారు. దీంతో మున్సిపల్, గ్రామపంచాయతీలకు ఆర్థికంగా నష్టం కలుగుతున్నది. ఈ నష్టాన్ని కొంత నివారించేందుకు 2020లో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం టీఎస్‌బీపాస్ నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది.

ఈ నిబంధనలతో కచ్చ లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇబ్బంది పడ్డారు. ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ప్లాట్లు లేదా వెంచర్లకు ప్రభుత్వం అనుమతులు తప్పనిసరిగా ఉండాలని షరతు పెట్టింది. దీంతో అనుమతులు లేకుండా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు అయోమయంలో పడ్డారు. అప్పట్లో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వడంతో చాలా మంది  దరఖాస్తు చేసుకు న్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎల్‌ఆర్‌ఎస్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదా రులకు ఊరట లభించింది. 

త్వరలో దరఖాస్తుల పరిశీలన

ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను సంబంధిత అధికారులు త్వరలో పరిశీలించనున్నారు. ఇప్పటికే ప్రజలు రెండు దఫాలుగా ఎల్‌ఆర్‌ఎస్ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఆ తర్వాత కోర్టు కేసులు, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళనలతో సర్కారు దిగివచ్చి ఎల్‌ఆర్‌ఎస్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఇప్పుడు వేసిన త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో పెడింగ్ దరఖాస్తులను పరిశీలించనున్నారు. 

కొత్త ప్లాట్ల కొనుగోలుపై స్పష్టత కరువు!

జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో అనుమ తులు లేకుండా వేసిన లే అవుట్లే ఎక్కువగా కనిపిస్తాయి. జిల్లాలో సుమారు 450  అక్రమ లే అవుట్లు ఉండవచ్చునని సమాచారం. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో 20,968, గ్రామపంచాయ తీల్లో 12,745 ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులు పెడింగ్‌లో ఉన్నాయి. ఇవన్నీ నాలుగు ఏళ్ల క్రితం రూ.1,000 చెల్లించి ఎల్‌ఆర్‌ఎస్ కోసం చేసుకున్న దరఖాస్తులు.

అయితే ఈ నాలుగేళ్ల కాలంలో కచ్చ లేఅవుట్లలో రియల్టర్లు వేల ప్లాట్లు విక్రయించారు. ఈ ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్ అవకాశం ఉందా లేదా అనేది స్పష్టత కరువైంది. మున్సిపల్ అధికారులను అడగితే గతంలో ఎల్‌ఆర్‌ఎస్ కోసం రూ.వెయ్యి చెల్లించినవారికే క్రమబద్ధీకరణకు అవకాశముందని అంటున్నారు. ఇదే గనుక నిజమైతే ఈ నాలుగు ఏళ్లలో కచ్చ లే అవుట్లలో కొనుగోలు చేసిన వారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది.