10 June, 2026 | 2:11 AM

‘సంగారెడ్డి' ని ఇండస్ట్రియల్ హబ్‌గా అభివృద్ధి చేయాలి

10-06-2026 01:08 AM
  1. జిల్లా సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి
  2. రైతులను క్రాప్ డైవర్షన్, ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించాలి
  3. జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి
  4. గ్రామీణ యువతులను నర్సింగ్ విద్య వైపు ప్రోత్సహించాలి
  5. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి, జూన్ 9(విజయక్రాంతి) : జిల్లా సమగ్ర అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని రాష్ట్ర కార్మిక, ఎంప్లాయిమెంట్ శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. తాగునీరు, వ్యవసా యం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, రవా ణా, ఆర్ అండ్ బి, పిసిబి, పి ఆర్, విద్యుత్, డి ఆర్ డి ఏ, సంక్షేమ శాఖలు, ఆర్టీసీ, షుగర్ కేన్, పరిశ్రమలు, తదితర రంగాల పురోగతిపై మంగళవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ హబ్గా వేగంగా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి జిల్లా మరింత పురోగతి సాధించేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యవసాయ రంగంలో రైతులను క్రాప్ డైవర్షన్ వైపు ప్రోత్సహిస్తూ, లాభదాయక పంట అయిన ఆయిల్ పామ్ సాగుపై విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖలు సమన్వయంతో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడాలని, రైతులకు యూరియా, డీఏపీ తదితర ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

రైతులకు సరైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించి ఆయిల్ పామ్ సాగు వైపు మళ్లించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా అమలవుతోందని, గూడు లేని పేదలకు సొంత ఇల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే జిల్లాలో గతంలో నిర్మించి కేటాయించని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.  మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సేవలు ప్రత్యక్షంగా చేరడం ముఖ్యమని అన్నారు. తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో అవసరమైన బోర్వెల్స్ కోసం వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన అన్ని డయాగ్నస్టిక్ పరికరాలు, డ్రగ్స్, అవసరమైన ఇక్యుమెంట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, డయాలసిస్ సేవలకు అవసరమైన చోట అదనపు పడకల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎంపీలు , ఎమ్మెల్సీ, శాసనసభ్యులు పలు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్ష సమావేశంలో ఎంపీలు రఘునందన్ రావు, సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజి రెడ్డి, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, సునీతా లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్లు సంగీత, పాండు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.