7 April, 2026 | 9:28 PM

పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి

07-04-2026 07:50 PM

- జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

బెల్లంపల్లి,(విజయక్రాంతి): ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని కన్నెపల్లి మండలం జన్కాపూర్, టేకులపల్లి గ్రామపంచాయతీలను సందర్శించి కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య మాట్లాడుతూ... 99 రోజుల కార్యాచరణలో భాగంగా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అధికారులకు సూచించారు.

ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను సేకరించాలని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, నీటి ట్యాంకులను ప్రతి 10 రోజులకు శుభ్రపరచాలని, పైప్ లైన్ల లీకేజీలు లేకుండా చూసుకోవాలన్నారు. అంగన్వాడి, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భోజన నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

విద్యార్థులతో మాట్లాడి వారికి అందుతున్న ఆహారం నాణ్యత, సౌకర్యాల వివరాలను తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు నిబంధనల ప్రకారం ఇండ్లు నిర్మించుకునేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక కొరత లేకుండా చూడాలని తెలిపారు. పెన్షన్లకు సంబంధించి సదరం సర్టిఫికేట్ తీసుకోవాలని సూచించారు.