16 March, 2026 | 1:28 PM

రోడ్డుప్రమాదంలో సంతాపూర్ ఉపసర్పంచ్ అంజయ్య మృతి

16-03-2026 11:49 AM

టమాట నారు కోసం వెళ్లిన ప్రయాణం విషాదాంతం

షాద్‌నగర్,(విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలోని(Shadnagar Constituency) కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ ఉపసర్పంచ్ అంజయ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఘటనతో సంతాపూర్ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్తుల సమాచారం ప్రకారం టమాట పంట నారు కోసం అంజయ్య రాయలసీమ ప్రాంతంలోని పెనుగొండకు వెళ్లారు.

అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో ఆయన ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అంజయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం గ్రామానికి చేరింది. ఈ వార్త తెలిసిన వెంటనే సంతాపూర్ గ్రామ ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రజలకు సేవ చేసే నాయకుడిని కోల్పోయామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంజయ్య మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.