12 March, 2026 | 5:02 PM

ఉప సర్పంచుల చెక్ పవర్ రద్దు చేయాలి: సర్పంచుల సంఘం డిమాండ్

12-03-2026 03:02 PM

రాజకీయ విభేదాలతో గ్రామాభివృద్ధి నిలిచిపోతోంది

జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేసిన

రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ

షాద్ నగర్,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీల్లో రాజకీయ విభేదాల కారణంగా అభివృద్ధి పనులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఉప సర్పంచులకు ఉన్న ఉమ్మడి సంతకం అధికారం (చెక్ పవర్)ను రద్దు చేయాలని రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొమ్ము కృష్ణ, కొత్తూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు ఎర్రోళ్ల జగన్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ ఉమ్మడి సంతకంతోనే నిధులు విడుదల కావాల్సి ఉంటుందని తెలిపారు. అయితే క్షేత్రస్థాయిలో రాజకీయ వైషమ్యాల కారణంగా ఉప సర్పంచులు అభివృద్ధి పనులకు సంబంధించిన చెక్కులపై సంతకం చేయకుండా నిరాకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కారణంగా గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, తాగునీటి సరఫరా వంటి అత్యవసర పనులకు చెల్లింపులు ఆగిపోతున్నాయని, ఫలితంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు.

ఉద్దేశపూర్వకంగా పనులను అడ్డుకోవడం ద్వారా సర్పంచులకు చెడ్డపేరు తీసుకురావాలనే రాజకీయ ఎత్తుగడలు జరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా కొందరు ఉప సర్పంచులు రాజకీయ లబ్ధి కోసం లేదా వ్యక్తిగత ప్రయోజనాల కోసం సర్పంచులను ఒత్తిడికి గురిచేస్తూ బ్లాక్మెయిల్ సంస్కృతికి తావిస్తున్నారని తెలిపారు. ఒక వ్యక్తి సహకరించకపోవడం వల్ల మొత్తం పంచాయతీ పరిపాలన స్తంభించిపోవడం గ్రామాభివృద్ధికి పెద్ద అడ్డంకిగా మారిందని అన్నారు.

గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు సజావుగా కొనసాగేందుకు ఉప సర్పంచుల చెక్ పవర్ అధికారాన్ని రద్దు చేయాలని, ప్రత్యామ్నాయంగా పంచాయతీ కార్యదర్శి లేదా సంబంధిత మండల అధికారికి ఆ బాధ్యతను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ఈ సమస్యపై ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను పంపి అవసరమైతే చట్టంలో తగిన సవరణలు చేయాలని కూడా సర్పంచుల సంఘం తరఫున విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో రాజకీయాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ వినతిపత్రాన్ని సమర్పించినట్లు పేర్కొన్నారు.