30 July, 2026 | 4:20 PM

కూలిన పెంకుటిల్లు.. బాధిత కుటుంబానికి అండగా సర్పంచ్

30-07-2026 03:49 PM

బోధన్, జులై 30 (విజయక్రాంతి): బోధన్ మండలంలోని అమ్ధాపూర్ గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఓ పెంకుటిల్లు కూలిపోగా( house collapsed ), గ్రామంలోని పలు డ్రైనేజీలు కూడా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న సర్పంచ్ పోరెడ్డి గంగాధర్ గురువారం సంఘటనా స్థలానికి చేరుకుని దెబ్బతిన్న ఇంటిని, డ్రైనేజీలను పరిశీలించారు.

బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో వర్షాల కారణంగా ఎక్కడైనా ప్రమాదకర పరిస్థితులు ఉంటే వెంటనే తెలియజేయాలని ప్రజలకు సూచించారు. డ్రైనేజీల మరమ్మతులు చేపట్టి వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఈ పరిశీలనలో జీపీఓ కిరణ్, గ్రామ కార్యదర్శి రంజిత్ కుమార్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ పల్లన్న, నారా సుధాకర్, సమీరుద్దీన్, కుంటి రాజు, గడ్డం సంగీతతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.