వ్యంగ్యమే ‘కాక్రోచ్’ ఆయుధం!
జంతర్ మంతర్ వేదికగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) చేస్తున్న నిరసన కార్యక్రమం ఫలిస్తుందా, ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా, లేదా? అన్నది ఇప్పుడే చెప్పలేం. కానీ, ఈ నిరసనలో ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ నిరసన కార్యక్రమంలో నినాదాలు, ప్రసంగాలు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించడం లేదు. హాస్యం, చమత్కారం, వ్యంగ్యం మేళవించిన కార్డ్‌బోర్డులు, ప్లకార్డులు, బ్యానర్లు, కార్లూన్లు కూడా అందర్నీ ఆకర్షిస్తున్నాయి.
నిరసనలకు, సృజనాత్మకతకు విడదీయరాని బంధం ఉందనే చారిత్రక సత్యాన్ని ఇవి మరోసారి గుర్తుచేస్తున్నాయి. 1789లో పారిస్‌లో జరిగిన విప్లవమైనా, నేడు ఢిల్లీలోని జన్‌పథ్‌లో కొనసాగుతున్న నిరసనలైనా సృజనాత్మకతను నిరసనల నుంచి వేరుచేయడం అసాధ్యమని దీని ద్వారా మరోసారి స్పష్టమైంది.
కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వేదికగా చేస్తున్న నిరసనలే భారతదేశంలో ఇప్పటివరకు జరిగిన అత్యంత సృజనాత్మక నిరసనలని చాలామంది అభివర్ణిస్తున్నారు. ప్లకార్డు, కార్టూన్ల రూపంలో దాగిన హాస్యచతురతను, వ్యంగ్యాన్ని చూస్తున్న వారు ఈ అభిప్రాయానికి వచ్చారు. వేల కిలోమీటర్ల దూరంలో ఉండి సోషల్ మీడియాలో చూస్తున్న వారిని కూడా ఇవి నవ్విస్తున్నాయి.
ఫ్రాన్స్ విప్లవానికి ముందు ఆ దేశంలో రాజరికాన్ని నేరుగా విమర్శిస్తే జైలుశిక్ష విధించేవారు. అలాంటి సమయంలో ఫ్రాన్స్ చక్రవర్తి లూయీ, రాణి మేరీ ఆంటోయినెట్టెలను కలిపి చిత్రకారులు జంతువుల రూపాలను చిత్రీకరించారు. అవి నాటి విప్లవకారుల ప్రసంగాల కంటే వేగంగా పారిస్ అంతటా వ్యాపించాయి. 1789 ఫ్రెంచ్ విప్లవానికి అనుకూల వాతావరణాన్ని రూపొందించడంలోనూ కీలకపాత్ర పోషించాయి.
అంతకుముందు నుంచే ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా నిరసనల సంస్కృతి ఉందని చరిత్ర చెబుతున్నది. అధికార యంత్రాంగంపై, అవినీతిపై, విశ్వాసాలపై నేరుగా మాట్లాడే, విమర్శించే పరిస్థితి లేనప్పుడు లేదా సామా న్య ప్రజలను మాటల ద్వారా చేరుకోవడం సాధ్యం కానప్పుడు ఇలాంటి చిత్రాలు సమాజం తన వాదనను వినిపించే సాధనాలుగా మారతాయి.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో కూడా ఇలాంటి చిత్రాలకు ఎంతో ప్రాధాన్యం లభించింది. 1943 బెంగాల్ కరువుపై చిత్రకారుడు చిత్తప్రసాద్ గీసిన హృదయవిదారక చిత్రాలు బ్రిటిష్ పాలన వైఫల్యాలను అధికారిక నివేదికల కంటే బలంగా ఎండగట్టాయి. దేశంలో ఎమర్జెన్సీ రోజుల్లో పత్రికలపై కఠిన నియంత్రణలు అమల్లో ఉన్న సమయంలో కార్టూనిస్ట్ అబూ అబ్రహాం కలం మాత్రం ఆగలేదు. ఆ కాలంలో చేసిన అనేక ప్రసంగాల కంటే ఆయన వ్యంగ్య చిత్రాలే నేటికీ మరింత పదునుగా, చిరస్థాయిగా గు ర్తుండిపోయాయి. ప్రతి తరంలోనూ ఇదే చరిత్ర పునరావృతమవుతూ వస్తున్నది. నేరుగా మాట్లాడటం ప్రమాదకరంగా మారినప్పుడు, ప్రసంగాలపై ని యంత్రణ విధించినప్పుడు లేదా మాటలు మాత్రమే సరిపోనప్పుడు సమా జం తన భావాలను వ్యక్తపరిచేందుకు చివరికి చిత్రాలనే ఆశ్రయిస్తున్నది.
చిత్రాలే ఎందుకు ప్రజలను చేరువవుతాయి?
2024 జూలైలో బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా 15 ఏళ్ల పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు జరిగినప్పుడు కళాకారుడు దేబాశిష్ చక్రవర్తి గీసిన చిత్రాలు ఆ ఉద్యమానికి ప్రతీకలుగా మారిపోయాయి. మాటల కంటే చిత్రా లే ఎందుకు ఎక్కువ మందికి చేరువవుతాయన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘కళ లేదా సాంస్కృతిక సృజనలో సందేశం అందరికీ పరిచయ మైన, అమాయకంగా కనిపించే రూపంలో దాగి ఉంటుంది.
అందువల్ల ప్రభుత్వ యంత్రాంగం వాటిని సులభంగా విచారించలేదు, నియంత్రిం చలేదు’ అని ఆయన అన్నారు. ఒక మీమ్, కార్టూన్, లేదా ప్లకార్డులో బాగా ప్రాచుర్యం పొందిన పదబంధాన్ని వాడతారు. సమాజానికి తెలిసిన మాటల ద్వారానే ఇవి నిరసనలను వ్యాప్తి చేస్తుంది. ఇదే విధానం కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలోనూ కనిపిస్తున్నది. నీట్ పేపర్ లీకులను ఒక శానిటరీ న్యాప్కిన్ ప్రకటనలో ప్రాచుర్యం పొందిన వాక్యం ద్వారా ఎద్దేవా చేసిన ప్లకార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడానికి కారణం కూడా అదే.
‘Even my sanitary pad is better than NTA. It doesn’t leak!’ (ఎన్టీయే కంటే నా శానిటరీ ప్యాడ్ చాలా బెటర్. అది లీక్ అవ్వదు) అనే ప్లకార్డు బాగా వైరల్ అయ్యింది. అదే కాదు, ఇలాంటి అనేక నినాదాలు జంతర్ మంతర్‌ను దాటి దేశాన్ని చుట్టి వచ్చాయి. Jaldi resignation de. Kal panvel nikalna hai (వెంటనే రాజీనామా చేయి.
రేపు పన్వేల్ వెళ్లాలి), బాలీవుడ్ సినిమా ‘దిల్‌వాలె దుల్హనియా లె జాయెంగె’లోని డైలాగ్‌కు పేరడీగా ‘బడే బడే దేశో మే చోటే చోటే బచ్చో కో నహీ మార్తే’, ‘మై హూ కాక్రోచ్’, చిన్న పిల్లలు పట్టుకున్న ప్లకార్డులో ‘Even my diaper has better leak protection than the NTA’ (ఎన్టీయే కంటే నా డైపర్ ఎక్కువగా లీక్‌ను అరికడుతుంది), ‘Modi melody khao. Hamara future nahi’ (మోదీ గారు మెలోడీ తినండి. మా భవిష్యత్తు కాదు) లాంటి నినాదాలు ఈ నిరసనలో ప్రభావవంతంగా పనిచేశాయి. ప్రజల దైనందిన జీవితంలో ఇప్పటికే ప్రాచుర్యంలో ఉన్న ప్రకటనలు, సినిమాలలోని డైలాగులను మార్చి, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపేలా మలచడమే దీనికి ప్రధాన కారణం.
కాక్రోచ్ గుర్తు కూడా ఈ కోవకే చెందుతుంది. మొదట అది ఒక అవమానకరమైన వ్యాఖ్యగా పుట్టింది. ఆ తర్వాత ఈ ఉద్యమానికి ప్రతీకగా మా రింది. ఇవన్నీ సహజంగా, ఆకస్మికంగా ప్రజల నుంచి వచ్చే ప్రతిస్పందనలే తప్ప, ముందస్తుగా ప్లాన్ చేసినవి కావు.
సాధారణంగా మీమ్‌ల ఆయుష్షు చాలా తక్కువ. నేటి సమాచార విప్లవకాలంలో 15 సెకన్ల చిన్న వీడియో కూడా చాలా పెద్దగా అనిపిస్తున్నాయి. అయినప్పటికీ కొన్ని మాత్రం కాలాన్ని దాటి నిలిచిపోతున్నాయి. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎక్కడో ఒకచోట ఈ నిరసనలో ఉపయోగించిన మీమ్‌లను మరొక అన్యాయాన్ని వ్యతిరేకించేందుకు ఎవరైనా మళ్లీ ఉపయోగి స్తారు. అదే ఈ వ్యంగ్య, హాస్యభరిత చిత్రాల ప్రభావానికి నిదర్శనం.
అన్నా హజారే నేతృత్వంలో సాగిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలోని ప్లకార్డులు, పోస్టర్లు విదేశాల్లో ఉన్న భారతీయులను సైతం స్వదేశానికి వచ్చి ఉద్యమంలో పాల్గొనేలా ప్రభావితం చేశాయి. అలాగే ఇరోమ్ షర్మిలకు బలవంతంగా ఆహారం అందిస్తున్న చిత్రం, చేగువేరా తలపై బెరెట్‌తో ఉన్న ఫొటో వంటివి కాలాలకు అతీతంగా శాశ్వత నిరసన చిహ్నాలుగా నిలిచాపోయాయి. చాలా దశాబ్దాల తర్వాత కూడా టీ-షర్టులపై, వీధి గోడలపై, ప్లకార్డులపై, ప్లెక్సీలపై అవి మళ్లీ మళ్లీ ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి.
కళాత్మకమైన ఈ సృజన ప్రముఖ కళాకారుల నుంచి రావడం లేదు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో కనిపిస్తున్న ఆకర్షణీయమైన చిత్రాల్లో అనే కం సాధారణ ప్రజల కుంచె నుంచి జాలువారినవే. ఢిల్లీలోనే కాదు, దేశవ్యాప్తంగా యువత చేస్తున్న అనేక నిరసనల్లో ఈ ధోరణి కనిపిస్తున్నది. అందుకే ఈ విధానం ప్రజల్లోకి చొచ్చుకెళ్తున్నది.
ఎడిటోరియల్ డెస్క్






