రాజ్యాంగాన్ని కాపాడండి..
పంజాబ్ ఓటర్లకు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ విజ్ఞప్తి
పంజాబ్, పంజాబీలను మోదీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది
నిరంకుశత్వ పాలనను తిప్పికొట్టాలని వినతి
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ 750 మంది మరణించారు
స్యూఢిల్లీ, మే 30: బీజేపీ చెర నుంచి ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పంజాబ్ ప్రజలను విజ్ఞప్తి చేశారు. రేపటితో సార్వత్రిక ఎన్నికల సమరం ముగుస్తున్న నేపథ్యంలో మన్మోహన్ సింగ్ ఓ వీడియో విడుదల చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పుడూ పంజాబ్‌ను, పంజాబీలను, పంజాబ్ సంస్కృతి, సంప్రదాయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తుంటుందని దుయ్యబట్టారు.
ఆయన విడుదల చేసిన వీడియోను కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది. ‘నా ప్రియమైన తోటి పౌరులారా.. ప్రస్తుతం భారతదేశం సంధి దశలో ఉంది. చివరి దశ పోలింగ్ సమీపిస్తున్న వేళ బీజేపీ దౌర్జన్యాల నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ఇదే చివరి అవకాశం. దేశంలో నిరంకుశత్వానికి తెరలేపాలని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. పంజాబ్, పంజాబీలు యుద్ధ వీరులు. పంజాబీలు త్యాగానికి నిదర్శనమని మనకు తెలిసిందే. మనలోని అనితరసాధ్యమైన ధైర్యం, ఆత్మ విశ్వాసం, సౌభ్రాతృత్వం, ఐకమత్యం, సామరస్యం మన గొప్ప దేశాన్ని కాపాడుతాయి’ అని మన్మోహన్ సింగ్ కోరారు.
తీవ్ర ఇబ్బందులు పెట్టింది..
గత పదేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పంజాబ్‌ను, పంజాబీలను, పంజాబ్ సంస్కృతి సంప్రదాయాలను తీవ్ర ఇబ్బందులు పెట్టేందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదల్లేదని మన్మోహన్ సింగ్ అన్నారు. ‘ఎన్నో నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఎదురుచూసుకుంటూ దాదాపు 750 మంది రైతులు అసువులుబాసారు.
వారిపైకి ప్రయోగించిన బుల్లెట్లు, లాఠీల దెబ్బలు చాలవని, ఏకంగా ప్రధాన మంత్రి వారిని ఆందోళనజీవులు, పరాన్న జీవులు అంటూ పార్లమెంటు వేదికపై దునుమాడారు. అంతగా వారిని దుర్భాషలాడేందుకు వారేం చేశారు. కేవలం వారిని సంప్రదించకుండా వారికి ఇబ్బందులు కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు అంతేకదా’ అని మన్మోహన్ సింగ్ కేంద్రప్రభుత్వాన్ని దుయ్యబట్టారు.
రైతులకు డబుల్ ఆదాయం ఏది?
2022 నాటికి రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చేలా చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. కానీ గత పదేళ్లుగా మోదీ పాలసీలతో వారి ఆదాయం దారుణంగా పడిపోయింది. దేశంలోని రైతుల నెలవారీ సరాసరి ఆదాయం కేవలం రోజుకు కేవలం రూ.27 మాత్రమే. అదే ప్రతి రైతు అప్పు మాత్రం రూ.27 వేలు ఉంది.
ఇంధనం, ఎరువుల ఖర్చుతో పాటు దాదాపు 35 వ్యవసాయ పనిముట్లపై జీఎస్టీ భారం, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఎగుమతులు, దిగుమతులపై పనికిరాని పాలసీ విధానాల వల్ల రైతులు డబ్బు ఆదా చేసుకోలేకపోతున్నారు. యూపీఏ ప్రభుత్వం 3.73 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.72 వేల కోట్ల రుణాలు మాఫీ చేసింది. కనీస మద్దతు ధర పెంచాం. ఉత్పత్తి పెరిగేలా చర్యలు తీసుకున్నాం. ఎగుమతులు పెరిగేలా నిర్ణయాలు తీసుకున్నాం. దీంతో మా హయాంలో రైతుల ఆదాయం గత పదేళ్లతో పోలిస్తే రెట్టింపు చేశాం’ అని మన్మోహన్ సింగ్ అన్నారు.






