26 July, 2026 | 9:43 AM

రుతుపవనాలు కేరళను తాకాయ్

31-05-2024 01:05 AM

చల్లని కబురు

అంచనాకు ఒక రోజు ముందే రాక

నాలుగైదు రోజుల్లో రాష్ట్రానికి!

న్యూఢిల్లీ, మే 30: దేశవాసులకు చల్లటి కబురు అందింది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. గురువారం ఉదయం కేరళను తాకాయని కేంద్ర వాతావరణ సంస్థ వెల్లడించింది. ఈశాన్య రాష్ట్రాలకు కూడా నైరుతి రుతుపవనాలు చేరాయని పేర్కొంది. ఈ సారి నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకుతాయని వాతావరణ సంస్థ ప్రకటించింది. అయితే అంచనాల కన్నా ఒక రోజు ముందే నైరుతి రుతుపవనాలు కేరళను చేరుకోవడం గమనార్హం. దీనితో తెలంగాణ రాష్ట్రానికి ౪, ౫ రోజుల్లో రుతుపవనాలు రావచ్చునని ఐఎండీఏ తెలిపింది. వచ్చే 24 గంటల పాటు కేరళలో నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుందని, ఎడతెరిపి లేని వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది.

ఇక, దక్షిణ అరేబియా సముద్రంతో పాటు మాల్దీవులు, కామోరిన్, లక్షద్వీప్, బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదిలే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అయితే గతేడాది నైరుతి రుతుపవనాలు జూన్ 8న కేరళ తీరాన్ని తాకాయి. ఈ ఏడాది కాస్త ముందుగానే తీరాన్ని తాకడంతో మరింత సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గత కొద్ది రోజులుగా కేరళలో వర్షం కురుస్తోంది. పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో రెమాల్ తుఫాన్ కారణంగా నైరుతి రుతుపవనాలు కాస్త చురుగ్గా కదలడంతోనే ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాలు కురిసేందుకు కారణమని వాతావరణ పరిశోధకులు చెబుతున్నారు.

సాధారణంగా ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్‌ప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ, మణిపుర్, అస్సాంలో జూన్ 5 నాటికి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. గతేడాది ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో లోటు వర్షపాతం నమోదు కాగా, ఈ ఏడాది లానినా పరిస్థితులు రావడంతో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కానుంది.