26 July, 2026 | 12:04 PM

చివరి దశకు ఎన్నికల సమరం

31-05-2024 12:50 AM

జూన్ 1న ఏడో విడుత పోలింగ్

గురువారంతో ప్రచారానికి తెర

బరిలో మోదీ సహా పలువురు ప్రముఖులు

న్యూఢిల్లీ, మే 30: దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్ 1న చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడింది. దేశవ్యాప్తంగా పూర్తిగా మైకులు బందయ్యాయి. ఏడో విడుతలో భాగంగా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 57 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ (13), బీహార్(8), హిమాచల్‌ప్రదేశ్(4), పంజాబ్(13), ఒడిశా(6), పశ్చిమ్ బెంగాల్(9), జార్ఖండ్(3), ఛంఢీగఢ్ (1)లోని స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ 57 స్థానాల్లో 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రాలవారీగా పంజాబ్‌లో 328 మంది, ఉత్తర్‌ప్రదేశ్‌లో 144 మంది, బీహార్‌లో 134 మంది, ఒడిశాలో 66 మంది, జార్ఖండ్‌లో 52 మంది, హిమాచల్‌లో 37 మంది, ఛండీగఢ్‌లో 19 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 

బరిలో ప్రముఖులు.. 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రధాని మోదీ బరిలో నిలిచారు. 2014 నుంచి ఆయన ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. మోదీకి ప్రత్యర్థిగా అజయ్ రాయ్‌ను కాంగ్రెస్ పోటీలో నిలిపింది. యూపీలోని గోరఖ్‌పూర్ నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ, సినీనటుడు రవికిషన్ బరిలో ఉన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీ స్థానంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తొలిసారి పోటీ చేస్తున్నారు.

అదే రాష్ట్రంలోని హమీర్‌పుర్ స్థానంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ నిలబడ్డారు. బీహార్ పాటలీపుత్ర సెగ్మెంట్‌లో లాలూప్రసాద్‌యాదవ్ పెద్ద కూతురు మీసా భారతి పోటీ చేస్తున్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నియోజకవర్గంలో బరిలో నిలిచారు. పంజాబ్ జలంధర్ నుంచి కాంగ్రెస్ తరఫున చరణ్‌జిత్‌సింగ్ చన్నీ, భటిండా నియోజకవర్గంలో అకాలీదళ్ నేత, కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ బాదల్ బరిలో ఉన్నారు.