పొదుపుతోనే విద్యుత్ ఆదా

17-09-2026 | 05:15am
  1. ఇంధన సామర్థ్యం పెంపుతో డిమాండ్‌కు చెక్ 
  2. వినియోగం తగ్గించి విద్యుత్ అవసరాలు తీర్చవచ్చు
  3. పరిశ్రమలకు తెలంగాణ అనుకూలం  
  4.   2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం
  5. డిసెంబర్7,8,9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’
  6.   25వ సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి  

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి) : విద్యుత్ పొదుపు(Electricity Conservation)తోనే పెరుగుతున్న డిమాండ్‌ను సమర్థవంతంగా అధిగమించవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) పేర్కొన్నారు. కొత్తగా విద్యుత్ ఉత్పత్తి(Electricity generation) చేసే కంటే అనవసరమైన విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకోవడం చౌకైన మార్గమని పేర్కొన్నారు. ఇంధన సామర్థ్యం(Fuel efficiency) పెంచడం ద్వారా పరిశ్రమల ఆర్థిక పోటీతత్వాన్ని మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ(Environmental Protection)కు దోహదపడుతుందన్నారు.

బుధవారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన 25వ సీఐఐ ఎనర్జీ ఎఫిషియెన్సీ సమ్మిట్(CII Energy Efficiency Summit)- కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఇప్పటివరకు ఇంధన వినియోగ విధానాన్ని సరఫరా కోణంలోనే చూశామని పేర్కొన్నారు. ‘ఎంత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది, ఎంత బొగ్గు అందుబాటులో ఉంది, ఎంత పునరుత్పాదక విద్యుత్‌ను జోడించగలం, ఎంత ట్రాన్స్మిషన్ మౌలిక వసతులు అవసరం వంటి అంశాలపైనే దృష్టి పెట్టామని’ తెఇపారు.

అయితే మనముందే మరో విద్యుత్ కేంద్రం ఉందని, దానికి పొగ గొట్టం, బొగ్గు గని, భూమి, కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్ అవసరం లేదని.. అదే ఇంధన సామర్థ్యమని వివరించారు. మెరుగైన మోటార్లు, సమర్థవంతమైన శీతలీకరణ వ్యవస్థలు, ఇంధన సామర్థ్య భవనాలు, మెరుగైన పారిశ్రామిక ప్రక్రియలు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చన్నారు. ప్రతి మెగావాట్ విద్యుత్ డిమాండ్‌ను శాశ్వతంగా తగ్గించగలిగితే మొత్తం విద్యుత్ వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.

వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో భవిష్యత్తులో విద్యుత్ వినియోగం మరింత పెరగనుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో మరిన్ని పరిశ్రమలు, తయారీ రంగం, డేటా సెంటర్లు, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెట్టుబడులు రావాల్సి ఉందన్నారు. విద్యుత్ డిమాండ్ పెరుగుతున్నందున అభివృద్ధి వేగాన్ని తగ్గించడం పరిష్కారం కాదని, ప్రతి యూనిట్ విద్యుత్‌తో మరింత ఆర్థిక కార్యకలాపాలను సాధించడమే పరిష్కారమని స్పష్టం చేశారు. పారిశ్రామిక సంస్థలు తక్కువ విద్యుత్ వినియోగిస్తే వాటి నిర్వహణ వ్యయం తగ్గుతుందన్నారు. తెలంగాణలో పీక్ విద్యుత్ డిమాండ్ తగ్గితే ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్ వ్యవస్థలపై ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు.  

ఏఐతో ఇంధన వినియోగంలో సమర్థత

ఇంధన సామర్థ్యంలో తదుపరి తరం సాంకేతికతలు కీలక పాత్ర పోషించనున్నాయని భట్టి పేర్కొన్నారు. పునరుత్పాదక ఇంధనం, విద్యుదీకరణ, డిజిటలైజేషన్, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్మెంట్‌తో పాటు కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతలను విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. సెన్సర్ల ద్వారా ఎక్కడ విద్యుత్ వృథా అవుతుందో గుర్తించవచ్చని, డిజిటల్ వ్యవస్థలతో పారిశ్రామిక ప్రక్రియలను నిరంతరం మెరుగుపరచవచ్చని చెప్పారు.

మానవ ఆపరేటర్లు గుర్తించలేని నమూనాలను కూడా కృత్రిమ మేధస్సు గుర్తించగలదన్నారు. భవిష్యత్తులో కర్మాగారాలు కేవలం విద్యుత్ వినియోగదారులుగా కాకుండా విద్యుత్ వ్యవస్థలో చురుకైన భాగస్వాములుగా మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇంధన సామర్థ్యం విషయంలో పరిశ్రమలకు మూడు సూచనలు చేశారు. ఇంధన వినియోగాన్ని కొలవకుండా వ్యవస్థాగత మార్పులు చేయడం సాధ్యం కాదని, అందుకే దీనిని ఏడాదికోసారి నిర్వహించే ఆడిట్‌గా కాకుండా నిరంతర పర్యవేక్షణ ప్రక్రియగా మార్చాలని స్పష్టం చేశారు.

అలాగే, ఒక పరిశ్రమలో విజయవంతమైన పొదుపు విధానాలను ఇతర వందలాది సంస్థలు నేర్చుకుని అమలు చేసేలా అనుభవాల మార్పిడికి అనువైన వ్యవస్థను రూపొందించాలని పిలుపునిచ్చారు. దీంతో పాటు ప్రభుత్వం, ఆర్థిక, విద్యా, సాంకేతిక సంస్థలు పరిశ్రమలతో కలిసి పనిచేస్తూ వాణిజ్యపరంగా లబ్ధి చేకూర్చే ఉత్తమ సాంకేతికతలను విస్తృత స్థాయిలో అన్ని సంస్థలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

ఈ మూడు సూత్రాలను ప్రాతిపదికగా తీసుకుని ముందుకు సాగితేనే పారిశ్రామికంగా ఇంధన సామర్థ్యంలో ఆశించిన పురోగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉందని  అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహణకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు