ఎయిర్‌పోర్ట్‌లో కత్తెర మిస్సింగ్!
36 విమాన సర్వీసులు రద్దు
జపాన్‌లో ఘటన
టోక్యో, ఆగస్టు 21: సాధారణ విమాన సర్వీసులు రద్దు అయ్యాయంటే వాతావరణం అనుకూలించకపోవడమో..? మరేదైనా సాంకేతిక సమస్యో..? లేదా భద్రతా పరమైన సమస్యో కారణమనుకుంటాం.. కానీ ఒక చిన్న కత్తెర కనిపించకపోవడంతో ఏకంగా 36 విమాన సర్వీసులు రద్దయిన ఘటన జపాన్‌లోని ఓ విమానాశ్రయం పరిధిలో చోటుచేసుకున్నది. హక్కైడో ద్వీపంలోని న్యూ చిటోస్ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం ఓ రిటైల్ స్టోర్‌లో కత్తెర కనిపించకుండా పోయింది. దీంతో నిర్వాహకులు భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు.
వెంటనే భద్రతా సిబ్బంది రెండు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏకంగా 36 విమాన సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చింది. మరో 201 విమాన సర్వీసులు ఆలస్యమ య్యాయి. చివరకు కత్తెర అదే షాపులో దొరకడం కొసమెరుపు. ఇంతకీ కత్తెర కనిపించకుండా పోతే ఇంత హడావుడి ఎందుకని అడిగితే ఓ పోలీస్ అధికారి.. ‘ఎవరైనా ఉగ్రవాది కత్తెరను అపహరించి, దాన్ని ఆయుధంగా వినియోగించే అవకాశం ఉంది. అందుకే విమాన సర్వీసులను సైతం రద్దు చేయాల్సి వచ్చింది’ అని చెప్పారు.






