యుద్ధవిమానం నుంచి జారిపడ్డ సామగ్రి!
22-08-2024 12:16 AM
నిర్మానుష్య ప్రాంతం కావడంతో తప్పిన ప్రమాదం
జైసల్మేర్, ఆగస్టు 21: భారత వైమానిక దళానికి చెందిన యుద్ధవిమానం నుంచి సామగ్రి జారి పడింది. ఆ యుద్ధ విమానం గాల్లో ఉండగా ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో అంతా అవాక్కయ్యారు. ఈ విషయాన్ని స్వయానా ఐఏఎఫ్ వెల్లడించడం గమనార్హం. బుధవారం రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. అయితే సామగ్రి కింద పడ్డ ప్రాంతం నిర్మానుష్య ప్రాంతం కావడంతో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని పేర్కొంది. ఈ ఘటనపై ఐఏఎఫ్ విచారణకు ఆదేశించింది. కింద పడింది ఏం సామగ్రి అనేది మాత్రం ఐఏఎఫ్ వెల్లడించలేదు. భారీ శబ్దం రావడంతో స్థానికులు అక్కడకు వెళ్లి చూశారని, అక్కడ ఒక వస్తువు ముక్కలు కనిపించినట్లు పోలీసులు తెలిపారు.






