21 June, 2026 | 5:09 AM

బాల్యానికి స్క్రీన్ స్ట్రోక్

17-08-2024 12:00 AM

ఈకాలం పిల్లలకు చేతిలో మొబైల్ లేనిదే ముద్ద దిగడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేస్తూ ఫిజికల్ యాక్టివిటీస్ దూరంగా ఉంటున్నారు. ఫలితంగా అధిక బరువు, రెటీనా, ఆటిజం లాంటి హెల్త్ ఇష్యూస్‌తో సతమతమవుతున్నారు. అయితే పిల్లలకు ఎంత స్క్రీన్ టైం ఉండాలి? పిల్లల నుంచి గ్యాడ్జెట్స్‌ను ఎలా దూరంచేయాలి? అనే విషయాలు ఈ వారం ఆటాపాటాలో తెలుసుకుందాం.

దేశంలో యూత్ ఇప్పటికే ఎక్కువగా స్క్రీన్ కు అతుక్కుపోవడం వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ లాంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇతరులతో పోలిస్తే పిల్లల్లో ఈ ప్రభావం ఎక్కువ. గంటలతరబడి స్క్రీన్ చూడటం వల్ల మెదడులో పలు మార్పులు జరుగుతాయి. నాడీ అభివృద్ధిని దెబ్బతిని ఇతర అనారోగ్యాలకు కారణమవుతుంది. మితిమీరిన స్క్రీన్ వాడకం 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలలో ఎదుగుదలను నియంత్రిస్తుంది.

అంతేకాదు కమ్యూనికేషన్ లో వెనుకపడేలా చేస్తుంది. ఇదే విషయమై చైల్ సైకాలజిస్ట్ డాక్టర్ స్వాతి చాబ్రా మాట్లాడారు.  “కొంతమంది పిల్లలను స్క్రీన్ సమయం నేరుగా ప్రభావితం చేయనప్పటికీ  న్యూరో డెవలప్‌మెంట్ డిజార్డర్స్‌లోకి నెట్టివేస్తుంది. 7 నుంచి 8 సంవత్సరాల పిల్లలు ఆటిజంతో బాధపడుతున్నారు. 3 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు అధిక స్క్రీన్ ప్రమాదకారకం‘ అని డాక్టర్ చాబ్రా చెప్పారు.

స్క్రీన్లతో ఎక్కువ సమయం గడిపే పిల్లలకు మయోపియా వచ్చే ప్రమాదం ఉందని, ఇది కంటి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని పలు హెల్త్ సర్వేలు కూడా చెబుతున్నాయి. రోజులు గడిచేకొద్దీ  రెటీనా సమస్యలు ఏర్పడి కంటిచూపు మందగిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. 2 సంవత్సరాల కంటే తక్కువ వయస్సున్న పిల్లలు స్క్రీన్ చూడొద్దట. అయితే 2 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఒక గంట లేదా అంతకంటే తక్కువ స్క్రీన్ సమయం ఇవ్వొచ్చు. 

అడిక్ట్ అయితే అంతే

ప్రస్తుత స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ ఫీచర్స్ ఉండటం, అందులో రకరకాల గేమ్స్, కార్టూన్స్ ఉండటంతో కంటిన్యూగా ఎంటర్‌టైన్ చేస్తుంటాయి. దీంతో చూసేకొద్ది చూడాలనిపిస్తుంటుంది. ఈ అలవాటు తెలియకుండానే పిల్లలను మొబైల్ అడిక్షన్ బారిన పడేలా చేస్తుంది. ఒకసారి పిల్లలు మొబైల్‌కు అడిక్ట్ అయితే వాళ్లను వాస్తవ ప్రపంచంలోకి తీసుకురావడం, ఇతరులతో కమ్యూనికేట్ చేయడం చాలా కష్టమవుతుంది.  

ఇక అధిక స్క్రీన్ రోజువారి దినచర్యపై ప్రభావం చూపుతుంది. నైట్ టైం స్క్రీన్ కారణంగా మెదడులోని ఫీల్‌గుడ్ కెమికల్ పిల్లలను పదే పదే మొబైల్ చూసేలా ప్రేరేపిస్తుంది. ఇది శారీరక శ్రమకు దూరంగా ఉంచుతుంది. అధిక ఊబకాయం మహమ్మారికి కారణమవుతుంది. 

ఫిజికల్ యాక్టివిటీస్

చాలామంది పేరెంట్స్ బిజీగా ఉండటంతో పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు ఇచ్చి తమ పనులను చేసుకుంటున్నారు. ఇది ఏంతమాత్రం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. వాటికి బదులు కథలు చెప్పడం, చదివించడం, సింగింగ్, పజిల్స్ ఫిల్ చేయడం లాంటి అలవాట్ల వైపు ప్రోత్సహించాలి. పిల్లలకు ఎక్సర్‌సైజులతో పాటు వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఆటలను పరిచయం చేయాలి. ఇందుకోసం దాగుడుమూతలు, కబడ్డీ లాంటివి నేర్పిస్తే బాగుంటుంది. వీలైతే ఆరుబయట ఆటలు ఆడేందుకు ఎంకరేజ్ చేయాలి. పచ్చని పరిసరాల్లో ఆటలు ఆడుకోవడం వల్ల పిల్లలు మరింత యాక్టివ్ గా ఉంటారు. 

ఈ తప్పులు చేయకండి

ఎట్టి పరిస్థితుల్లోనూ టీవీ చూస్తూ భోజనం చేయించకండి. టీవీ, మొబైల్ చూస్తూ తినడం వల్ల పిల్లలు బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది.  స్క్రీన్ చూసే ఆ కొద్ది సమయం కూడా పిల్లలతో కలిసి మీరూ చూసే ప్రయత్నం చేయండి. ఆ స్క్రీన్ టైమ్ కూడా వారి ఎదుగుదలకు పనికొచ్చే విధంగా ఉండేలా చూడాలి. అలాంటి వీడియోలు, గేమ్స్ చూసేలా ఎంకరేజ్ చేయాలి. స్క్రీన్ టైంను తాము ఎందుకు బలవంతంగా తగ్గిస్తున్నామో పిల్లలకు వివరించండి. ఇది అంత సులువు కాకపోయినా.. కొంత కాలానికి వాళ్లు కూడా మెల్లగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు.

కొంతమంది ఇళ్లల్లో 24 గంటలూ టీవీ నడుస్తూనే ఉంటుంది. చూసినా, చూడకపోయినా అలా ఆన్ చేసి వదిలేస్తారు. పిల్లలు ఉన్న ఇంట్లో ఇది చాలా ప్రమాదం. వాళ్లు మెల్లగా టీవీ వైపు ఆకర్షితులు అవడానికి ఇది ప్రధాన కారణం అవుతుంది. అందువల్ల మీరు చూడని సమయంలో టీవీ ఆఫ్ చేసి ఉంచండి. ఇక బెడ్రూమ్లో టీవీలు, స్మార్ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్ లేకుండా చూడాలి.

బెడ్రూమ్లో ఈ ఎలక్ట్రానిక్ డివైజ్లు ఉన్న పిల్లలు, ఇతర పిల్లల కంటే ఎక్కువ సమయం స్క్రీన్లపై గడుపుతారు. నిద్ర పోకుండా సోషల్ మీడియాలో గడుపుతుంటారు. దీన్ని కట్టడి చేసేందకుగానూ ఇన్‌స్టాలో.. ‘నైట్ టైం నడ్జెస్’ అనే ఫీచర్ ను ప్రవేశపెట్టింది. రాత్రిళ్లు స్క్రీన్ టైంను తగ్గించేందుకు ఈ టూల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

స్క్రీన్ టైం నష్టాలివే

ఆన్‌లైన్ వీడియోలు ఎక్కువగా చూడటం.. సోషల్‌మీడియాను గంటలతరబడి వాడటం లాంటివి పిల్లలు రోగ నిర్ధారణ బారినపడేలా చేస్తున్నాయని అమెరికాకు చెందిన సైకోథెరపిస్ట్ డాక్టర్ జార్జ్ లిన్ అన్నారు. పిల్లలు స్క్రీన్ అడిక్ట్‌తో నిద్రలేమి, వెన్నునొప్పి, బరువు హెచ్చుతగ్గులు, దృష్టి సమస్యలు, తలనొప్పి, ఆందోళన, ఒంటరితనం ఏర్పడుతాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ఏకైక మార్గం శారీరక శ్రమను ప్రోత్సహించడం. ‘మీ పిల్లల కోసం సృజనాత్మక కార్యకలాపాల వైపు ఎంకరేజ్ చేయాలి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం.. శారీరక శ్రమను మెరుగుపరచడం, స్కీన్ టైం తగ్గించడం వల్ల పిల్లలకు మంచి నిద్రతో పాటు శారీరకంగా, మానసికంగా చురుగ్గా ఉంటారు. ఆరోగ్యంగా ఎదగాలంటే పిల్లలు తక్కువ కూర్చొని ఎక్కువ ఆడాలి.