తెలంగాణలోనూ వైద్యసేవలు బంద్
- ట్రైనీ డాక్టర్ అత్యాచారం ఘటనపై కొనసాగుతున్న నిరసనలు
- నేడు 24 గంటల పాటు ఓపీ సేవలకు వైద్యుల నిరాకరణ
- మద్దతునిచ్చిన వైద్యులు, నర్సింగ్ సంఘాలు
హైదరాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): కోల్‌కతా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల పీజీ ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసుపై దేశవ్యాప్తంగా వైద్యుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణలో నూ వైద్యులు, వైద్య విద్యార్థులు ఈ ఘటనపై ఆగ్రహంతో ఉన్నారు. జూడాలు, రెసిడెంట్ డాక్టర్లు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు కూడా ఈ ఆందోళనకు తోడయ్యారు. దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న ఐఎంఏ, ఎస్‌ఆర్‌డీఏ, జుడా సంఘాలకు తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) తెలిపింది.
మరోవైపు కోల్‌కతా ఘటనకు నిరసనగా శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్ చేస్తున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఒక ప్రకటనలో తెలిపింది. తాము కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలంగాణ శాఖ వెల్లడిం చింది.
ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ ఈ నిరసనలో పాల్గొంటున్న నేపథ్యంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటల పాటు రోగులకు రాష్ట్రవ్యాప్తంగా ఓపీ సేవలు నిలిచిపోనున్నాయి. ఓపీ సేవల బంద్ నేపథ్యంలో రోగులు అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. అత్యవసర వైద్య సేవలు మాత్రం అన్ని దవాఖానల్లో కొనసాగనున్నాయని వైద్య సంఘాలు వెల్లడించాయి.
కొనసాగుతున్న జూడాల నిరసన
బాధిత ట్రైనీ డాక్టర్ కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని జూనియర్ డాక్టర్లు, రెసిడెంట్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు ప్రజలను సైతం ఏమార్చేందుకు ప్రయత్నించిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మృతురాలి కుటుంబసభ్యులకు ప్రభుత్వం పరిహారం అందించాలని, వారిని ఆదుకోవాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు రాత్రనక పగలనక సేవలు అందిస్తున్న తమకు రక్షణ కల్పించాలని, దేశవ్యాప్తంగా సెంట్రల్ హెల్త్ ప్రొటెక్షన్ చట్టాన్ని అమల్లోకి తీసుకువచ్చి వైద్యులకు భద్రత కల్పించాలనే డిమాండ్ తో ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఉత్తరాఖండ్‌లోనూ..
ఉత్తరాఖండ్‌లో నర్సింగ్ ఆఫీసర్‌పై అత్యాచారం, షాద్‌నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో విధుల్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్‌పై దాడిని, కోల్‌కతా పీజీ ట్రైనీ డాక్టర్ అత్యాచార ఘటనలను తెలంగాణ ప్రభుత్వ నర్సెస్ అసోసియేషన్ (టీఎన్‌ఏ) తీవ్రంగా ఖండిస్తోందని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం నర్సులందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు కావాలని ఆమె విజ్ఞప్తి చేశారు. రోగులకు ఇబ్బంది కలగకుండా ఉదయం 9 గంటల నుంచి గంటపాటు నిరసన ప్రదర్శనలో పాల్గొంటామని తెలిపారు.






