4 April, 2026 | 2:14 AM

భద్రత మరింత కట్టుదిట్టం చేయాలి

04-04-2026 12:39 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 3 ( విజయక్రాంతి ): సలేశ్వరం జాతర సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భద్రత ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని జోగులాంబ జోన్ డీఐజీ ఎల్.ఎస్. చౌహన్ జిల్లా పోలీస్ యంత్రాంగానికి సూచించారు. శుక్రవారం నల్లమల అటవీ ప్రాంతంలో కొనసాగుతున్న సలేశ్వరం జాతర వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ భక్తుల సంఖ్య కనుక్కునంగా ఎప్పటికప్పుడు సేవ కార్యక్రమాలు మెరుగుపరచాలన్నారు.

జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్తో కలిసి జాతర ప్రాంతంలో ఏర్పాటు చేసిన బందోబస్తును సమీక్షించారు. జాతరకు వచ్చిన భక్తుల భద్రత కోసం సుమారు 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీఐజీ తెలిపారు. జాతరలో పోలీస్ అధికారులు చేపట్టిన భద్రతా ఏర్పాట్లపై డీఐజీ సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ను అభినందించారు.

గురువారం రాత్రి నాగర్ కర్నూల్ ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ బాబుమియా కాలుజారి లోయలో పడిపోవడంతో విధుల్లో ఉన్న ఎస్త్స్ర మురళి, కానిస్టేబుల్స్ ఊర్మిళ, మణికల్ వెంటనే స్పందించి అతనిని పైకి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు. వారి సాహసాన్ని డీఐజీ ప్రశంసించారు.