సభలో కలుస్తానా!
09-03-2026 01:48 AM
ఒంటరిగా కనిపించినప్పుడు
చూడనట్లు ముఖం తిప్పేసిన వాడు
ఆత్మీయ ఆలింగనమై
అల్లుకుపోతాడు
నీకూ నాకూ మధ్య
ఆకాశ పాతాళాలంత
దూరం అనుకునే ఆమె
తన నవ్వుల సువాసనని
నా నాసికాగ్రం ముందు
నాట్యం చేయిస్తుంది
నాది కపిత్వమని కంఠాన్ని
మండించిన వాడు
మరో పుస్తకం ఎప్పుడని
నోటి నిండా మిఠాయి
తీపితో పలకరిస్తాడు
తన రాతలో నన్ను ప్రస్తావించి
పెంచడం నచ్చని విమర్శకుడొకడు
ముందు మాట కోసం దస్తీ పరుస్తాడు
మిత్రమా ! మిమ్మల్ని
ఉపయోగించుకుంటాం
అని కనిపించిన ప్రతిసారీ
వల్లె వేసే పీఠాధిపతి
మరో సారి పాడిందే పాడి
యుగళ గీతానికి అంతం
లేదని చాటుతాడు
ఇదంతా తప్పని తంతని తెలుసు
అయినా పరస్పరం పూరకం కాకపోతే
జనాభా లెక్కలోంచి
తప్పిస్తారని హాజరిచ్చి
బతికున్నానని నన్ను నేను
సంతృప్తి పరచుకుంటుంటాను
వి.ఆర్. తూములూరి






