విత్తు.. అన్నదాత చిత్తు
ఆదిలాబాద్ మార్కెట్లో నకిలీ పత్తి విత్తనాలు
మారుమూల గ్రామాల రైతులే లక్ష్యంగా దందా
చోద్యం చూస్తున్న వ్యవసాయ శాఖ అధికారులు
ఆదిలాబాద్, జూన్ ౧౧, (విజయ క్రాంతి): దేశానికి అన్నం పెట్టే రైతన్నలను మోసగించేందుకు నకిలీ పత్తి విత్తనాల దందా ఆదిలాబాద్ జిల్లాలో యథేచ్ఛగా కొనసాగుతోంది. జిల్లాకు నలుమూలల ఆనుకొని మహారాష్ర్ట ఉండడంతో మహారాష్ర్ట, గుజరాత్ రాష్ర్టల నుండి నకిలీ విత్తనాల సరఫరా జోరుగా సాగుతోంది. ఈ నకిలీ విత్తనాల కట్టడిపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఖరీఫ్ సీజన్ ప్రారంభం కంటే ముందు నుండే నకిలీ విత్తనాల సరఫరా అరికట్టేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసినప్పటికీ జిల్లాలో నకిలీ విత్తనాల కట్టని మాత్రం జరగడం లేదు. జిల్లాలో ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతం ఉండడంతో దళారులు అమాయక రైతులని లక్ష్యంగా చేసుకొని ఈ దందా సాగిస్తున్నారు.
తాజాగా ఇచ్చోడ మండలంలో నిషేధిత బీజ్ 3 పేరిట పత్తి విత్తనాలు మార్కెట్లో విక్రయించడం కలకలం రేపుతోంది. విత్తన ప్యాకెట్ పై మ్యాన్ ఫ్యాక్చర్ తేదీ, లాట్ నంబర్, లేకపోవడం, అదేవిధంగా కొనుగోలు చేసే రైతులకు డీలర్లు ఎలాంటి రసీదులు ఇవకపోవడంతో ఈ నకిలీ దందా వెలుగు చూసింది. అధికారులు బడాబడా విత్తన ఏజెన్సీలపైనే దృష్టి పెట్టి తనిఖీలు చేస్తూ, మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లోని చిరు వ్యాపారస్తులను విస్మరించడంతో మారుమూల ప్రాంతాల్లో ఈ నకిలీ విత్తనాల దందా కొనసాగుతోంది.
మారుమూల రైతులే లక్ష్యం
ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ శాతం ఆదివాసి ప్రాంతాలు ఉండడంతో మారుమూల గ్రామాల్లో అమాయకమైన రైతులనే లక్ష్యంగా చేసుకొని ఈ నకిలీ విత్తనాల దందాను దళారులు యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో ప్రతి రోజు ఏదో ఒక చోట నకిలీ విత్తనాలు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవలే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నకిలీ పత్తి విత్తనాలను ఓ గోదాములో పట్టుకున్న ఘటన మరువక ముందే, తాజాగా ఇచ్చోడ మండలంలో బీజ్ 3 పేరిట నకిలీ పత్తి విత్తనాలు మార్కెట్లో డీలర్లు యదేచ్చగా అమ్ముతున్నారు. మారుమూల ప్రాంతాల్లోని రైతులను చూసి ఇలాంటి విత్తన ప్యాకెట్లను విక్రయించడం జరుగుతుంది. వీటి గురించి అంతగా తెలియక రైతులు ఈ విత్తనాలను నాటిన అనంతరం మొలకెత్తకపోవడంతో అన్నదాతలు ఆర్థికంగా నష్టపోతున్నారు.
చోద్యం చూస్తున్న అధికారులు
జిల్లాలో నకిలీ విత్తనాల దందా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులు కలిసి ఏర్పడిన టాస్క్ ఫోర్స్ బృందాలు తరచూ తనిఖీలు చేయాల్సి ఉన్నప్పటికీ, కేవలం పట్టణ ప్రాంతాల్లో తనిఖీలు చేసి మారుమూల ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టకపోవడంతో నకిలీ విత్తనాలను డీలర్లు యథేచ్ఛగా అమ్ముతున్నారు. తనిఖీలు సైతం నామమాత్రం గానే కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
పీడీ యాక్ట్ నమోదు చేయాలి
రాష్ర్ట ప్రభుతం సర్టిఫై చేసిన విత్తనాలను రైతులకు అందించాలి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గుజరాత్ నుండి తీసుకొచ్చిన బీజ్ 3 విత్తనాలను అమాయక రైతులను ఆసరాగా చేసుకుని అంట గట్టడడం జరుగుతుంది. మరి ముక్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో బీటీ 3 విత్తనాలు అమ్ముతున్నారు. రైతులు ఈ విత్తనాలను తీసుకొని నష్టపోయే పరిస్థితి ఉంది. దీనిపైన జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు, విజిలెన్స్, టాస్క్ పోర్స్ అధికారులు కలిసి దాడులు చేపట్టాలి. నకిలీ విత్తనాలను అమ్మిన డీలర్లపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి.
సంగెపు బొర్రన్న,
రైతు సరాజ్య వేదిక
జిల్లా అధ్యక్షుడు






