బల్దియాలో ఉప ఎన్నికలకు వేళాయె!
నాలుగు డివిజన్లలో ఖాళీలు
ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు కార్పొరేటర్లు
ఇద్దరి అకాల మరణంతో మరో 2 స్థానాలు ఖాళీ
6 నెలల క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ
మరోసారి రిమైండ్ లేఖ రాయనున్న బల్దియా
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 11 (విజయక్రాంతి): గ్రేటర్‌లో మూడున్నర సంవత్సరాల క్రితం బల్దియా పాలక మండ లి ఎన్నికలు జరిగాయి. మరో ఏడాదిన్నర పూర్తయితే ప్రస్తుత పాలక మండలి గడువు కూడా ముగియనుంది. నిబంధనల ప్రకారం 6 నెలలకు పైగా పాలక మండలి కాల పరిమితి ఉన్నట్టయితే కచ్చితంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
ఈ మేరకు గ్రేటర్‌లోని 150 డివిజన్లలో 4 స్థానాలు ఖాళీ అయ్యాయి. వాస్తవానికి బల్దియాలో ఖాళీ స్థానాల వివరాలను 6 నెలల క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం లేఖ ద్వారా తెలియజేసింది. కానీ 2023 నవంబరు 30న శాసనసభకు, ఆ తర్వాత 2024 మే 13న పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. ఇటీవలనే పార్లమెంటు ఎన్నికలు పూర్తయి కోడ్ ముగిసిన నేపథ్యం లో కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న కార్పొరేటర్ స్థానాలకు ఉప ఎన్నికల నిర్వహణపై అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఈ మేరకు బల్దియాలో ఖాళీ స్థానాలకు ఎన్నికల నిర్వహ ణపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి మరోసారి రిమైండింగ్ లెటర్ రాయనున్నారు.
4 స్థానాలు ఖాళీ..
జీహెచ్‌ఎంసీ పాలక మండలికి 2020 డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలు గెలుపొందాయి. వీరిలో గుడిమల్కాపూర్ డివిజన్ (71) కార్పొరేటర్ దేవర కరుణాకర్ 2023 జనవరి 13న, 2024 జూన్ 4న ఎర్రగడ్డ (101) డివిజన్ కార్పొరేటర్ షాహీన్ బేగం అకాలంగా మృతిచెందా రు. 2023 నవంబరు 30న నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో మెహిదీపట్నం (70) డివిజన్ కార్పొరేటర్, మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, శాస్త్రీపురం డివిజన్ (58) కార్పొరేటర్ ముబీన్ బహదూరపురా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎంఐఎం పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేలుగా గెలుపొందా రు.
దీంతో మెహిదీపట్నం, శాస్త్రీపురం, గుడిమల్కాపూర్, ఎర్రగడ్డ డివిజన్లలో కార్పొ రేటర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వాస్తవానికి ఏదైనా డివిజన్లలో కార్పొరేటర్ స్థానాలు ఖాళీ కాగానే స్థానికంగా ఉండే జీహెచ్‌ఎంసీ సర్కిల్ అధికారుల ద్వారా నివేదిక తెప్పించుకొని జీహెచ్‌ఎంసీ కార్యదర్శి ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్‌కు తెలియజేస్తారు. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఖాళీల వివరాలను లేఖ ద్వారా వివరిస్తారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ఆధారంగా ఖాళీ స్థానాలను భర్తీ చేసేందుకు ఉప ఎన్నికలు జరగనున్నాయి.
మరోసారి లేఖ..
వాస్తవానికి ఏదైనా డివిజన్‌లో కార్పొరేటర్ స్థానం ఖాళీ అయితే 15 రోజుల్లోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియజేయాల్సి ఉంటుంది. ఆ సమయంలో పాలక మండలి గడువు 6 నెలలకు మించి ఉన్నట్టయితే కచ్చితంగా 4 నెలల లోగానే ఉపఎన్నికలు నిర్వహించాలి. కానీ జీహెచ్‌ఎంసీలో గుడిమల్కాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవర కరుణాకర్ 2023 జనవరి 13న మరణించారు. అయినా బల్దియాలో ఉప ఎన్నికలు జరగలేదు. అనంతరం అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలుగా గెలుపొందడం, మరో కార్పొరేటర్ కూడా అకాలంగా మరణించారు.
ఇప్పటికే ఒకసారి (6 నెలల క్రితం) ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా ఖాళీల వివరాలను తెలియజేసిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. ప్రస్తుతం మొత్తం 4 ఖాళీలు ఉన్న ట్టుగా మరోసారి లేఖ రాయనున్నట్టు జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం అధికారులు తెలియజేశారు. జీహెచ్‌ఎంసీ పాలక మండ లి గడువు మరో ఏడాదిన్నర కాలం ఉండడంతో కచ్చితంగా ఉప ఎన్నికలు నిర్వ హించాల్సి ఉంది. దీంతో బల్దియాలో ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ఎప్పుడు విడుదల చేస్తుందోనంటూ అధికారులతో పాటు స్థానిక రాజకీయ పార్టీలు వెయిట్ చేస్తున్నాయి.






