నేటి నుంచి రైతు వేదికల్లో విత్తన మేళా
ఆరుతడి పంటల సాగుకు ఊతం
మహబూబాబాద్, జులై 26 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఏ ర్పడ్డ వర్షాభావ పరిస్థితుల్లో ఈ వానాకాలం ఆరుతడి పంటల సాగుకు రైతులను సన్న ద్ధం చేయడానికి సోమవారం నుండి రెండు మూడు రోజులపాటు మహబూబాబాద్ జి ల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 18 మండలాల్లోని రైతు వేదికల్లో ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ విత్తన మేళా నిర్వహిస్తోంది.
ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలతో పాటు ప్రైవేట్ ట్రేడర్ల ద్వారా రైతు వేదికల్లో ఆరుతడి పంటల సాగు కోసం అవసరమైన (సర్టిఫైడ్) ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నారు. తక్కువ నీటి వినియోగంతో చేపట్టే ఆరుతడి పంటలుగా, వర్షాధార పంటలుగా సాగు చేసే పప్పు ధాన్యాలు, కూరగాయలు, ఆకుకూరలు విత్తనాలను రైతు వేదికల్లో అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు అనుసరించాల్సిన వివిధ రకాల పద్ధతులను రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు రైతు మేళా కార్యక్రమంలో వివరిస్తారు.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి: స్వర్ణ విజయ చంద్ర, డిఏఓ,
మహబూబాబాద్ జిల్లా ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలోని రైతులు వరి పంట సాగును పూర్తిగా తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. ఆశించిన వర్షపాతం నమోదు కాక పోవడంతో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఫలితంగా రైతులు తక్కువ నీటి వినియోగంతో, వర్షాధారంతో పండే ఆరుతడి పంటలను సాగు చేసుకోవడం ఉత్తమం. రైతు మేళాలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు తప్పనిసరిగా రశీదు తీసుకొని పంటకాలం పూర్తయ్యేంతవరకు జాగ్రత్త చేసుకోవాలి. ప్రత్యేక రైతు మేళాను సద్వినియోగం చేసుకోవాలి.






