03-02-2026 12:11:30 AM
తయారీకి నోచుకోని సేంద్రియ ఎరువులు
ఆదాయ వనరులు అన్నది ఉత్తిమాటే..
నూతన సర్పంచులు వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
కోదాడ, ఫిబ్రవరి 2 : గ్రామాలను, పట్టణాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తడి, పొడి చెత్త వేరు చేసేందుకు గాను సెగ్రిగేషన్ షెడ్లను మంజూరు చేసి నిర్మాణం చేపట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం కూడా గ్రామాలలో ఈ విధానాన్ని అనుసరిస్తుంది..గ్రామాల్లో ఎక్కడా చెత్త కనిపించకుండా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు చేర్చి సెగ్రిగేషన్ షెడ్లలో తడి, పొడి చెత్తలను వేరు చేసి కంపోస్టు ఎరువులను తయారు చేసి గ్రామపంచాయితీలకు ఆర్ధిక వనరులు సమకూర్చేలా చర్యలు చేపట్టింది.
జిల్లా వ్యాప్తంగా కొన్ని గ్రామాల్లో మాత్రమే సేంద్రీయ ఎరువులను తయారు చేస్తున్నారు. ఎక్కువ గ్రామాల్లో నిరుపయోగంగా ఉంటున్నాయి. సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణ ఉద్దేశ్యం మంచిదైనప్పటికీ ఆచరణలో కార్యరూపం దాల్చకపోవడంతో లక్ష్యం దెబ్బతింటుంది. గ్రామాలు, పట్టణాల్లో సైతం వీటిని నిర్మించారు. తడి, పొడి చెత్త వేరు చేసేందుకు ఇంటింటికి బుట్టలు, చెత్త సేకరించే విషయమై ప్రజలకు అవగాహన కూడా కల్పించారు.
ట్రాక్టర్‌లు ఉన్న పలితం శూన్యం
పకడ్బందీగా చెత్తను డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్ షెడ్లకు చేర్చేందుకు ప్రతి గ్రామపంచాయితీకి ఒక ట్రాక్టర్ను కూడా మంజూరు చేశారు. సదరు ట్రాక్టర్ ద్వారా గ్రామాల్లో చెత్తను సేకరించి డంపింగ్ యార్డుల వద్ద కుప్పగా పోసి ఆ తరువాత తడి, పొడి చెత్తలను వేరు చేసి సేంద్రీయ ఎరువును తయారు చేసే లక్ష్యంగా గ్రామాలకు ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదు.
జనావాసాలకు దూరంగా షెడ్లు ఏర్పాటు
జనావాసాలకు దూరంగా గ్రామ శివారులో వీటిని ఏర్పాటు చేశారు. తడి, పొడి చెత్తను అరబెట్టేందుకు డ్రైయింగ్ ప్లాంట్స్, స్టోర్ రూమ్లను ఏర్పాటు చేశారు. పాచిపోయిన ఆహారం, కుళ్లిన కూరగాయలు, ఆకుకూరలు తడి చెత్త డబ్బాలో వేయాలి. చిత్తు కాగితాలు, తుప్పు పట్టిన వస్తువులు, కలప, ప్లాస్టిక్ తదితర వాటిని పొడి చెత్త డబ్బాలో వేయాలి. గ్రామాల్లో అవగాహన కల్పించి చెత్త డబ్బాలను కూడా పంపిణీ చేశారు. ప్రతి వార్డులో సేకరించిన తడి, పొడి చెత్తను సేంద్రీయ ఎరువుకు వినియోగించనున్నారు. పొడి చెత్తను రీసైక్లింగ్ ‘ ప్లాంట్కు తరలిస్తారు. తడి చెత్తను వర్మికంపోస్టు ఎరువుగా తయారు చేసి కొద్ది రోజులు నిల్వ ఉంచి ఎరువుగా మార్చి రైతులకు విక్రయిస్తారు. అధిక గ్రామాల్లో సేంద్రీయ ఎరువులను తయారు చేయకపోవడంతో గ్రామపంచాయితీలకు ఆదాయ వనరులు తగ్గుతున్నాయి. సెగ్రిగేషన్ షెడ్లు నిరుపయోగంగా ఉంటున్నాయి.
నెరవేరని లక్ష్యం
ఒక్కొక్క షెడ్ను రూ.12 లక్షలు వెచ్చించి నిర్మించారు. సూర్యాపేట జిల్లాలో 475 గ్రామపంచాయితీలు ఉన్నాయి. అధికారులు ఎప్పటికప్పుడు గ్రామపంచాయితీ సర్పంచ్లను కంపోస్టు ఎరువు తయారు చేయాలని ఆదేశిస్తున్నారు. గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా గ్రామపంచాయితీ పారిశుధ్య కార్మికులు లేరు. ఏ గ్రామంలో చూసినా జనాభాకు అనుగుణంగా నలుగురు, ఐదుగురు గ్రామపంచాయితీ కార్మికులు పనిచే స్తున్నారు. ఎక్కువ శాతం మంది మల్టీపర్పస్ కార్మికులుగా పనిచేస్తూ తక్కువ వేతనాన్ని పొందుతున్నారు. నెలకు రూ.9500 మాత్రమే చెల్లిస్తుండడంతో మల్టీపర్సన్ వర్కర్లుగా పనిచేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
నెలవారీగా వేతనాలు ఇవ్వకపోవడంతో ఉన్న వారు కూడా వెళ్లిపోతు న్నారు. దీంతో కంపోస్టు ఎరువును తయా రు చేయడం సర్పంచ్లకు ఇబ్బందిగా మా రింది. నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్లు వృధాగా ఉంటున్నాయి. గ్రామపంచాయితీలకు ఆదాయ వనరులు తగ్గుతున్నాయి. . కొన్ని గ్రామాల్లో స్థలాలు లేక ఇరుకు స్థలాల్లో సెగ్రిగేషన్ షెడ్లను నిర్మించారు. సదరు ప్రాంతాల్లో కంపోస్టు ఎరువు తయారు చేయడం ఇబ్బందిగానే ఉంది. దీనితో ప్రభుత్వ లక్ష్యం నెరవేరనట్లు అయింది. ప్రస్తుతం నూతనంగా సర్పంచులు పదవి బాధ్యతలు చేపట్టడంతో సెగ్రిగేషన్ షెడ్ల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వాటి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొచ్చి ఆదాయ వనరులుగా మార్చాలని పలువురు కోరుతున్నారు.