29 August, 2026 | 1:09 AM

50 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం ఏర్పాటు

28-08-2026 10:48 PM

క్రీడాకారులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనకు కృషి

కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం,(విజయక్రాంతి): నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత కల్పించి, క్రీడాకారులకు అవసరమైన మెరుగైన మౌలిక వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నియోజకవర్గంలోని వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, కోచ్‌లతో సమగ్ర స్పోర్ట్స్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బృందావనం ప్రాంతం సమీపంలో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో అన్ని హంగులతో కూడిన సమగ్ర క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు.

అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ వంటి క్రీడలకు అవసరమైన మైదానాలు, కోచ్‌ల సహకారం, మెరుగైన శిక్షణా సౌకర్యాలను అందుబాటులోకి తెస్తామన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి తగిన ప్రోత్సాహం అందిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొత్తగూడెం పేరును నిలబెడతారని పేర్కొన్నారు.  ఈ సమావేశంలో జిల్లా యువజన క్రీడల అధికారి పరంధామారెడ్డి, వాసిరెడ్డి మురళీ, మహీధర్, పుట్టా శంకరయ్య, డాక్టర్ యుగేందర్ రెడ్డి, వాసిరెడ్డి నరేష్, ప్రేమ్, బావుసింగ్, వై.వి. వెంకటేశ్వరరావు, బాబ్జి తదితరులు పాల్గొన్నారు.