28 August, 2026 | 10:21 AM

కరీంనగర్‌కు దక్కిన ఆతిథ్యం

28-08-2026 12:00 AM

-ఖేలో ఇండియా పోటీలకు ఎంపిక 

-జూడో పోటీలు ఇక్కడే

కరీంనగర్, ఆగస్టు 27 (విజయక్రాంతి): ఈ ఏడాది డిసెంబర్లో లో జరగనున్న 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు ఆతిథ్య నగరాల్లో ఒకటిగా కరీంనగర్ ఎంపికయింది. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ తోపాటు కరీంనగర్ జిల్లాను ఎంపిక చేశారు. కరీంనగర్ లో జూడో పోటీలు జరగనున్నాయి.

ఈ పోటీల కోసం అంబేద్కర్ స్టేడియం, ఎల్ ఎం డి సమీపంలోని ప్రాంతీయ క్రీడా పాఠశాలను పరిశీలిస్తున్నారు. అత్యధిక మంది వీక్షించే వీలున్న అంబేద్కర్ స్టేడియమే ఎంపిక చేసే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు 22 కోట్ల రూపాయలను విడుదల చేసింది.

ఇందులో నుండి కరీంనగర్లో నిర్వహించే జూడో పోటీలకు నిధులు విడుదలవుతాయి. జాతీయస్థాయి క్రీడలు జరగడం కరీంనగర్ లో ఇదే మొదటిసారి. జిల్లాకు చెందిన క్రీడాకారులు ఇప్పటికే జూడో క్రీడల్లో జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. జాతీయస్థాయి క్రీడలు ఇక్కడ జరుగుతున్న క్రమంలో క్రీడాకారుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తోంది. కరీంనగర్ క్రీడా ఆతిథ్యం ఇవ్వడం ద్వారా దేశ స్థాయిలో కరీంనగర్ కు కీర్తి రానుంది. గతంలో కరీంనగర్లో ఒక విద్యాసంస్థ రాష్ట్రస్థాయి జూడో పోటీలను ఇక్కడ నిర్వహించింది. ఇదే స్ఫూర్తితో కరీంనగర్లో జూడో పోటీలను నిర్వహించేందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సిద్ధమవుతోంది.

- పది రాష్ట్రాల నుండి పాల్గొనే అవకాశం...

దేశంలో జూడో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జూడో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సేవలను అందిస్తోంది. ఇప్పటికే ఈ ఫెడరేషన్ నిర్వహించిన శిక్షణలో చాలామంది ఆటగాళ్లు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. కరీంనగర్ లో జరిగే ఖేలో ఇండియా యూత్ 8వ క్రీడా పోటీలకు దేశంలోని క్రీడాకారులు ఎక్కువగా ఉన్న మణిపూర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఢిల్లీ, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. క్రీడాకారుల కోసం కరీంనగర్ లోని ప్రముఖ రెస్టారెంట్లు, లాడ్జిలలో ముందస్తుగా బుక్ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

ఖేలో ఇండియా పోటీలపై కరీంనగర్ క్రీడా ప్రాధికార సంస్థ అధికారి శ్రీనివాస్ విజయక్రాంతితో మాట్లాడుతూ అధికారికంగా స్థలం ఎంపిక కావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుతం జూడో పోటీలకు ఆతిథ్యం ఇవ్వాలని నిర్ణయించారని, పోటీల తేదీల ఖరారు తర్వాత మరికొన్ని ఆటలకు ఆతిథ్యమిచ్చే అవకాశం కూడా లేకపోలేదని తెలిపారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, క్రీడాకారుల సహకారంతో ఈ పోటీలను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.