ఢిల్లీలో తెలంగాణ భవన్‌కు రాహుల్
అక్కడే భోజనం చేసి సిబ్బందితో ముచ్చట్లు
లోక్‌సభ ఫలితాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయని వెల్లడి
హైదరాబాద్, మే 23 (విజయక్రాంతి): ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గురువారం సందడి చేశారు. ఎవరూ ఊహించని విధంగా అక్కడికి వచ్చిన ఆయన కాసేపు భవన్‌లో కలియదిరిగారు. ఢిల్లీలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆయన.. గురువారం పార్టీ నేతలతో కలిసి తెలంగాణ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు. తెలంగాణ భవన్‌లోని క్యాంటిన్ లో పార్టీ నేతలతో కలిసి లంచ్ చేసి తెలంగాణ రుచులను అస్వాదించారు. అనంతరం రాహుల్‌గాంధీ మీడియాతో మాట్లాడారు.
అధికారం ఇండియాదే
ఈసారి కేంద్రంలో ఇండియా కూటమే అధికారం చేపడుతుందని రాహుల్‌గాంధీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా, అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండబోతున్నాయని అన్నారు. ఢిల్లీలోని ఏడు ఎంపీ సీట్లలో ఇండియా కూటమిదే విజయమని పేర్కొన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోబోతున్నదని తెలిపారు. ప్రధాని మోదీ రాజ్యాంగం, రిజర్వేషన్ల మీద దాడి చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను అదానీకి దోచి పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో 90 శాతం ఉన్న పేదలు, దళితులు వెనుకబడిన వర్గాల కోసమే ఈ ఎన్నికలు అని అన్నారు.
మెట్రోలో ప్రయాణం
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌గాంధీ గురువారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణిం చారు. సామాన్య ప్రజలతో కలిసి ప్రయాణిస్తూ వారితో ఫొటోలు దిగారు. ఈశాన్య ఢిల్లీ లోక్‌సభ అభ్యర్థి కన్హయ్య కుమార్‌తో కలిసి మంగోల్‌పురి ర్యాలీకి మెట్రోలో వెళ్లారు.






