ముగ్గురి ప్రాణం తీసిన సెల్ఫీ సరదా
ఏపీ అల్లూరిలో జలపాతం వద్ద ఘటన
అమరావతి, ఏప్రిల్ 9: సెల్ఫీ మోజు ముగ్గురు బాలికల ప్రాణాలు తీసింది. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి గ్రామ సమీపంలో ఉన్న జలపాతం వద్ద సెల్ఫీలు దిగుతూ త్రిష (17), రత్నకుమారి (16), పవిత్ర (16), అంజలి అనే బాలికలు కాలుజారి జలపాతంలో పడిపోయారు. నీటి ప్రవాహానికి బాలికలు కొట్టుకుపోయారు.
స్థానికులు రక్షించేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది. ముగ్గురు బాలికలు మృతి చెందగా, అంజలి పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతగిరి మండలం లుంగపర్తి ఆసుపత్రికి తరలించారు. బాలికలు సరదాగా గడుపుదామని జలపాతం వద్దకు వచ్చారు. వీరంతా హుకుంపేట మండలం జుంబువలస వాసులని స్థానికులు తెలిపారు. మృతి చెందిన బాలికలంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో తీవ్ర విషాదం నెలకొంది.




