10 April, 2026 | 3:01 AM

టీఎంసీతో అభివృద్ధికి ఆటంకం

10-04-2026 01:12 AM
  1. వామపక్షాలు, కాంగ్రెస్ ఒకే కోవకు చెందినవి
  2. రాష్ట్రంలో నందిగ్రామ్ ఫలితాలే పునరావృతం
  3. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ

కోల్‌కతా, ఏప్రిల్ 9: టీఎంసీ ప్రభుత్వం అభివృద్ధికి ఆటంకం కల్పిస్తున్నదని, ప్రైవేటు సెక్టార్లలో స్థానికంగా ఉన్న సామాన్యులను ఉద్యోగాల నుంచి తొలగించి చొరబాటుదారులకు అవకాశం కల్పిస్తున్నదని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ మోసాలు, పాపాలు అంతా కాదని, వందేళ్లు గడిచినా తొలగిపోవని ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. వామపక్షాలు, కాం గ్రెస్ పార్టీలను కూడా బెంగాల్ విశ్వసించిందని ఈ పార్టీలన్నీ ఒకే కోవకు చెందినవని విమర్శించారు. ఇక్కడి ప్రజల కలలను, ఆకాంక్షలను అణచివేశాయన్నారు.

గురువారం అసన్‌సోల్, బీర్‌భూమి, హల్దియాలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని టీఎంసీని లక్ష్యం గా చేసుకున్నారు. ఐదేళ్ల క్రితం నందిగ్రామ్‌లో ఫలితమే పశ్చిమ బెంగాల్ అంతటా పునరావృతం కాబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు.   రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ అమలు చేస్తామని చెప్పారు. శరణార్థులకు రాజ్యాంగబద్ధంగా ప్రత్యేక హక్కుల ను కల్పిస్తామని, చొరబాటుదారులను దేశం నుంచి తరిమికొడతామని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే 7వ వేతన కమిషన్ అమల్లోకి తీసుకొస్తామని ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు హామీ ఇచ్చారు.