calender_icon.png 15 February, 2026 | 4:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రీ ఎంట్రీకి సై.. డీ గ్లామర్ కు జై

15-02-2026 01:47:14 AM

ఒకప్పుడు గ్లామర్ క్వీన్స్‌గా వెండితెరను ఏలిన హీరోయిన్లు ఇప్పుడు డీగ్లామర్ పాత్రలతోనూ మనసు దోచేస్తున్నారు. అందంగా కనిపించడం కన్నా నటనకు ఆస్కారమున్న పాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతున్నారు. ప్రస్తుతం స్టార్‌గా బిజీగా ఉన్న మరికొందరు భామలు కూడా ప్రయోగాత్మక చిత్రాలను ఓకే చేస్తున్నారు. కథ డిమాండ్ మేరకు విభిన్న పాత్రల్లో కనిపించడం ద్వారా ప్రేక్షకులను మెప్పించడమే కాక, సినిమా విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

నరేశ్ ఆరుట్ల

సీనియర్ కథానాయికలు ఇప్పుడు విభిన్నమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. గ్లామర్ ప్రపంచాన్ని పక్కన పెట్టి పాత్రలో పరకాయ ప్రవేశం చేయడమే వీరికి అసలైన సక్సెస్ మంత్రంగా మారింది. ‘నారప్ప’ సినిమాలో ప్రియమణి పోషించిన సుందరమ్మ పాత్రలో తన రూపం కంటే ఆమె పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులకు గుర్తుండిపో తాయి. ఇటీవల ‘తాయ్ కిళవి’ సినిమాలో రాధికా శరత్‌కుమార్ లుక్ అందరినీ ఆశ్చర్యపర్చింది.  

సరికొత్తగా సెకండ్ ఇన్నింగ్స్.. 

చాలామంది హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టడమో, లేక ఇతర వ్యక్తిగత కారణా లతోనో కెరీర్‌కు కాస్త బ్రేక్ ఇస్తున్నారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రొటీన్‌గా ఉండే తల్లి, వదిన క్యారెక్టర్లకే పరిమితం కాకుండా కథను మలుపు తిప్పే బలమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. వెండితెరపై తమ ఇమేజ్‌ను కాపాడుకుంటూనే, యువ కథానాయి కలకు పోటీనిస్తున్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న ఇలాంటి పాత్రలు చేయడం వల్ల వారి కెరీర్ గ్రాఫ్ మళ్లీ పెరగడమే కాకుండా, నటిగా వారికి మంచి సంతృప్తినిస్తుంది. 

స్టార్ స్టేటస్‌ను పక్కనపెట్టి మరీ.. 

అందం శాశ్వతం కాదు కానీ, అభినయం ఎప్పటికీ చిరంజీవి అని ఈ సీనియర్ హీరోయిన్లు నిరూపిస్తున్నారు. డి-గ్లామర్ పాత్రలు పోషించడం అంటే అది ఒక రకమైన ధైర్యమే. తమ స్టార్ స్టేటస్‌ను పక్కన పెట్టి సామాన్య మహిళలుగా వెండితెరపై కనిపించి, తమ నటనతో మెప్పిస్తున్నారు. గతంలో చేసిన గ్లామర్, కమర్షియల్ పాత్రల తరహా పాత్రలను ఇప్పుడు తిరిగి చేయాలనే ఉద్దేశం సీనియర్ హీరోయిన్లకు లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఇది కేవలం ట్రెండ్‌ను అనుసరించడమే కాకుండా వ్యూహాత్మక నిర్ణయంగా కూడా భావించవచ్చు. థియేటర్లలో ఇటీవల స్టార్ హీరోయిన్ల సినిమాలకు కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రావడంలేదనేది అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో సీనియర్ హీరోయిన్లు తీసుకుంటున్న ఈ కొత్త నిర్ణయాలు వారి కెరీర్‌ను మరింత కాలం ముందుకు సాగేలా దోహదం చేస్తాయి. 

తాజాగా రీఎంట్రీ ఇచ్చినవాళ్లు వీరే.. 

ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు కీలక పాత్రలతో మెప్పిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘మిరాయ్’ చిత్రంలో నటి శ్రియా శరణ్ తల్లి పాత్రలో కనిపించింది. ఇక తన నడుము అందాల విందుతో యువతను ‘ఖుషి’ చేసిన భూమిక.. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న తాజాచిత్రం ‘యుఫో రియా’లో యంగ్ మదర్ రోల్‌లో కనిపించింది. స్టార్ హీరోయిన్ సమంత కెరీర్ ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగే దశలో ఉంది. వ్యక్తిగత జీవితంలో జరిగిన పరిణామాలు ఆమె సినీ కెరీర్‌ను కాస్త నెమ్మదించేలా చేశాయి. అయితే ఇప్పుడు రెండోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సమంత.. తన స్టార్ స్టేటస్‌ను పక్కనపెట్టి, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతు న్నట్టు తెలుస్తోంది.

సమంత ప్రస్తు తం ‘మా ఇంటి బంగారం’ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆమె భర్త రాజ్ నిడిమోరు సమర్పకుడిగా వ్యవహరిస్తూ, క్రియేటివ్ ఇన్‌పుట్స్ కూడా ఇస్తున్నట్టు సమాచారం. ఇటీవల తనను సంప్రదిస్తున్న దర్శకులకు కేవలం సినిమాల కథలు కాకుండా వెబ్ సిరీస్ కాన్సెప్టులనూ తీసుకురావాలని సమంత సూచిస్తున్నట్టు వినికిడి. ఇక లయ, ఇంద్రజ వంటి వారు కూడా మహిళా ప్రాధాన్య పాత్రలను ఓకే చేస్తూ నటనారంగంలో మళ్లీ బిజీ అయ్యే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే లయ ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాలో మళ్లీ శివాజీతో కలిసి నటిస్తోంది. ఆకట్టుకునే కథతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

‘సీఎం పెళ్లాం’, ‘విప్లవ వీరులు’ వంటి ప్రాజెక్టుల్లో భాగం కావటం ద్వారా ఇంద్రజ మళ్లీ నటిగా బిజీ అవుతున్నారు. చాలా కాలం సినిమాల్లో కనిపించని పూజాహెగ్డే ఇటీవల ఆసక్తికరమైన ప్రాజెక్టుల్లో భాగమవుతోంది. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఆమె ఇప్పుడు బాగా వినవస్తోంది. ‘జన నాయగన్’ సినిమాలో పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించనుంది. దళపతి విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. ఇటు తెలుగులోనూ పూజాహెగ్డే మళ్లీ స్ట్రిప్టులను ఓకే చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వరుస ప్లాపులతో అవకాశాలు అందుకోలేకపోయిన ఈ భామ ఇప్పుడు కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోందని తెలుస్తోంది. కెరీర్ పీక్‌లో ఉన్నప్పటికీ రష్మిక, శోభిత ధూళిపాళ్ల వంటివారు విభిన్న పాత్రలతో మెప్పిస్తున్నారు.