16 June, 2026 | 2:35 AM

శంషాబాద్‌లో నీటి నిల్వ ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పరిశీలన

16-06-2026 01:06 AM
  1. హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ సంయుక్త పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ పర్యటన
  2. వర్షాకాలానికి ముందే శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశం

శంషాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): గతంలో భారీ వర్షాల సమయంలో తీవ్ర నీటి నిల్వ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొన్న శంషాబాద్ పట్టణంలోని హ్యాపీ మొబైల్స్ పాయింట్ పరిసర ప్రాంతాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్, ట్రాఫిక్ సంయుక్త పోలీసు కమిషనర్ జోయెల్ డేవిస్ సోమవారం సందర్శించి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు వర్షపు నీరు నిల్వ ఉండటానికి గల కారణాలను ప్రత్యక్షంగా పరిశీలించి, సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.

భారీ వర్షాల సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ట్రాఫిక్ శాఖ అధికారులను ఆదేశించారు. రహదారులపై నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అవసరమైన మరమ్మతు పనులను వేగవంతం చేయాలని సూచించారు.స్థానిక ప్రజల నుంచి సమస్యల వివరాలను తెలుసుకున్న అధికారులు, నీటి నిల్వ సమస్యను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల భద్రత, ట్రాఫిక్ సౌలభ్యం దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ పర్యటనలో డి.ఎస్.పి రాజేష్, ట్రాఫిక్ సీఐ ప్రమోద్ కుమార్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.