16 June, 2026 | 2:07 AM

బాలలు పనిలో కాదు బడిలో ఉండాలి

16-06-2026 01:05 AM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జూన్ 15 (విజయక్రాంతి): ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ హరిచందనతో కలిసి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ విషయమై ఎమ్మెల్యే మాట్లాడుతూ బాల్యం అనేది ప్రతి చిన్నారి జీవితంలో అత్యంత విలువైన దశ అన్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేయకూడదని పిలుపునిచ్చారు.

బాలలు పనిలో కాదు, బడిలో ఉండాలని.. విద్య ద్వారానే వారి భవిష్యత్తు వెలుగొందుతుందని ఆయన ఆకాంక్షించారు. గ్రామాల్లోని పొలాల్లో, పట్టణాల్లోని హోటళ్లు, మెకానిక్ షాపులు తదితర ప్రాంతాల్లో మగ్గుతున్న బాలలను గుర్తించాలన్నారు. వారిని తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని కోరారు. బాల కార్మిక వ్యవస్థను సమాజం నుండి పూర్తిగా నిర్మూలించాలంటే ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, తల్లిదండ్రులు సమిష్టిగా బాధ్యత తీసుకుని పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.

పాఠశాలలకు దూరమైన ప్రతి చిన్నారికి మళ్లీ అక్షర ముక్క అందించడం మన అందరి కనీస బాధ్యత అని ఆయన గుర్తుచేశారు. కేవలం నాణ్యమైన విద్యతోనే సమాజంలో సమాన అవకాశాలు, పిల్లల్లో ఆత్మవిశ్వాసం, దేశంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాల కార్మిక నిర్మూలన సంఘం ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.