సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలి

17-09-2026 | 05:10am
  1. తెలంగాణ విమోచన చరిత్రను భావితరాలకు తెలియజేయాలి
  2. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల డిమాండ్
  3. మాజీ గవర్నర్ దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహణ

ఖైరతాబాద్, సెప్టెంబర్ 15 (విజయక్రాంతి): సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని(Telangana Liberation Day) రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశం(Round table meeting)లో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. అలయ్ బలాయ్ ఫౌండేషన్(Alai Balai Foundation) ఆధ్వర్యంలో బండారు విజయలక్ష్మి(Bandaru Vijayalakshmi) నేతృత్వంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌(Somajiguda Press Club)లో ‘తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీలు కోదండరామ్, అంజిరెడ్డి, ప్రేమ్‌సింగ్ రాథోడ్, బీఎస్ రాములు, పాశం యాదగిరి, పాదూరి కరుణ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. సెప్టెంబర్ 17 తెలంగాణ చరిత్రలో కీలకమైన రోజు అని బండారు దత్తాత్రేయ అన్నారు. నిజాం పాలనలో ప్రజలు ఎదుర్కొన్న అణచివేత, రజాకార్ల దమనకాండను ఆయన ప్రస్తావించారు.

సర్దార్ వల్లభభాయ్ పటేల్ నాయకత్వంలో భారత సైనిక చర్య అనంతరం నిజాం పాలన ముగిసి, తెలంగాణ ప్రాంతం భారత సమాఖ్యలో విలీనమైందని పేర్కొన్నారు. విమోచన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకోవడం, ఆ చరిత్రను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. అనంతరం సీహెచ్ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన చరిత్రను మరచిపోవద్దన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్‌పల్లి గ్రామాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తుచేశారు.

రజాకార్ల దమనకాండకు బైరాన్‌పల్లి విషాద సాక్ష్యంగా నిలిచిందన్నారు. చరిత్రను రాజకీయాలకు అతీతంగా చూడాలని, వాస్తవాలను భావితరాలకు తెలియజేయాలని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్రల్లో తమ రాష్ట్రాల్లో విలీనమైన ప్రాంతాలకు సంబంధించిన చారిత్రక సందర్భాలను అధికారికంగా నిర్వహిస్తున్న విధంగానే తెలంగాణలోనూ సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని కోరారు.

చారిత్రక ఆధారాల సేకరణ, పరిశోధనలకు ప్రోత్సాహం, పాఠ్యాంశాలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా యువతకు తెలంగాణ విమోచన చరిత్రను పరిచయం చేయాలని సూచించారు. సెప్టెంబర్ 17న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశం ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు