సుప్రీంకోర్టులో మమతకు ఎదురుదెబ్బ
కేంద్ర ఉద్యోగుల నియామకంపై కొత్త ఉత్తర్వులు అవసరం లేదన్న న్యాయస్థానం
న్యూఢిల్లీ, మే 2: పశ్చిమ బంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌కు ముందు టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఓట్ల లెక్కింపులో పర్యవేక్షకులుగా కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) ఉద్యోగులను నియమించాలని ఈసీ ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని టీఎంసీ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరించారు. దీంతో మమత ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. శనివారం సుప్రీంకోర్టుకు సెలవు రోజు అయిన ప్పటికీ అత్యవసరంగా విచారించింది. కౌంటిం గ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలని ఏమీ రూల్ లేదని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నియమిస్తే తప్పేంటి? అని ప్రశ్నించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నియామకం నిబంధనలకు విరుద్ధం కాదని తెలిపింది. ఈ విషయంలో కొత్త ఉత్తర్వులు ఏం అవసరం లేదని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులే ఉండాలన్న టీఎంసీ వాదనను న్యాయస్థానం తిరస్కరించింది. ఏప్రిల్ 30న ప్రతికౌంటింగ్ టేబుల్ దగ్గర కనీసం ఒక సూపర్ వైజర్ లేదా అసిస్టెంట్ కేంద్ర ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) నుంచి ఉండాలని ఎన్నికల సంఘం ఒక ఆదేశాన్ని జారీ చేసింది. ఇదే రాజకీయ దుమారం రేపింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు బీజేపీ ప్రభావంతో పనిచేయవచ్చని టీఎంసీ ఆరోపించింది. దీంతో టీఎంసీ కోల్‌కతా హైకోర్టును అటుపిమ్మట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. టీఎంసీ మమతా బెనర్జీకి న్యాయపరమైన స్పష్టమైన ఎదురుదెబ్బతగిలిందని బీజేపీ నాయకుడు అమిత్ మాల్వీయా అన్నారు. కాగా మే 4న పశ్చిమ బంగాల్ ఓట్ల లెక్కింపు జరగనుంది.






