ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్
- చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా నివాసం
- డిపోర్టేషన్ సెంటర్‌కు తరలింపు
కుత్బుల్లాపూర్, జూన్ 13(విజయక్రాంతి): జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామారం హెచ్‌ఏఎల్ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్న ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు జీడిమెట్ల పోలీసులు దాడులు నిర్వహించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో వారి వద్ద చెల్లుబాటు అయ్యే పాస్‌పోర్టులు, వీసాలు లేవని గుర్తించారు.
అలాగే భారత్‌లో నివసించేందుకు అవసరమైన ఇతర చట్టబద్ధ పత్రాలు కూడా లేనట్లు వెల్లడైంది. అక్రమంగా దేశంలోకి ప్రవేశించి, దేశంలోని పలు ప్రాం తాల్లో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. కుత్బుల్లాపూర్ డీసీపీ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు చేపట్టిన జీడిమెట్ల పోలీసులు, ఏడుగురు బంగ్లాదేశ్ జాతీయులను మెదక్ జిల్లా జోగిపేటలోని డిపోర్టేషన్ సెంటర్కు తరలించారు.






