700 మంది ఉగ్రవాదుల పరార్
టెర్రరిస్టుల కోసం బంగ్లాలో ముమ్మర వేట
ఢాకా, డిసెంబర్ 5: ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన సమయంలో బంగ్లాదేశ్‌లోని జైళ్ల నుంచి దాదాపు 2,200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. వీరిలో కరడుగట్టిన టెర్రరిస్టులు, ఉరిశిక్ష పడిన హంతకులు ఉన్నారు. వారిలో ఇంతవరకు దాదాపు 1,500 వందల మందిని భద్రతా బలగాలు తిరిగి అదుపులోకి తీసుకున్నాయని జైళ్ల శాఖ చీఫ్ సయీద్ మహమ్మద్ మోతెర్ హోసైన్ తెలిపారు.
ఇంకా దాదాపు 700 మంది జాడ నేటికీ తెలియడం లేదని పేర్కొన్నారు. వీరిలో 70 మంది కరడుగట్టిన ఉగ్రవాదులు, ఉరిశిక్ష పడిన హంతకులు ఉన్నారని వెల్లడించారు. పరారైన ఖైదీల కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వారి సమాచారాన్ని దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపామని, వారి ఆచూకీ కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొ న్నారు. అలాగే ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న ఉగ్రవాదులపై కూడా నిఘా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.






