6 July, 2026 | 1:54 AM

రోస్టర్ విధానంలో మాలలకు తీవ్ర అన్యాయం

06-07-2026 12:52 AM
  1. రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ
  2. ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో మాలల మహాధర్నా

ముషీరాబాద్, జూలై 5 (విజయక్రాంతి): రోస్టర్ విధానంలో మాలలకు తీరని అన్యా యం జరుగుతుందని, ఎస్సీ గ్రూపు111లో ఉన్న మాల, ఇతర 25 కులాల మొదటి రోస్టర్ పాయింట్‌ను 22 నుంచి16కు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువస్తానని రాష్ట్ర కార్మిఖ ఉపాధి శాఖమంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. మాలల రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న రోస్టర్ విధానాన్ని సవరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ లో మాలల చలో ఇందిరాపార్కు నినాదంతో మాల ప్రజాఫ్రంట్ చైర్మన్ డాక్టర్ మంచాల లింగస్వామి ఆధ్వర్యంలో మాలలు మహాధర్నా నిర్వహించారు.

ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాలలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ మాలల మహాధర్నాకు ముఖ్య అతిధులుగా రాష్ట్ర కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి సుద్దాల దేవయ్యలు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ప్రస్తుత రోస్టర్ విధానం వల్ల గ్రూపు 111లో ఉన్న మాల, ఇతర 25కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని,  గ్రూపు111లో ఉన్న మాల మొదటి రోస్టర్ పాయింట్ ను 22 సంఖ్యనుంచి 16 సంఖ్యకు మార్చాలని ఈ విషయంపై క్యాబినెట్ సమావేశంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఒత్తిడి తీసుకువస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమస్యపై మాలలంతా ఐక్యంగా పోరాటం చేయాలని సూచించారు.

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య మాట్లాడు తూ ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానం వల్ల మాల విద్యార్ధులకు, నిరుద్యోగ యువతకు ఆన్యాయం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రోస్టర్ పాయింట్ ను సవరించి మాలలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జాతీయ షెడ్యూల్డు కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజు ఉస్తాద్, మాల ప్రజాప్రంట్ చైర్మన్ డాక్టర్ మంచాల లింగస్వామి, వైస్ చైర్మన్ దాసరి విశాల్, ఛీప్ కో ఆర్డినేటర్లు మైసే నాందేవ్, అంజలి, మాల మహానాడు గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ బేర బాలకిషన్(బాలన్న), మాల మాహానాడు రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్,  గౌరవ అధ్యక్షుడు చెరుకు రాంచందర్ లు మాట్లాడుతూ ఎస్సీ గ్రూపు111 లో ఉన్న మాల, ఇతర 25కులాల మొదటి రోస్టర్ పాయింట్ ను 22 నుంచి16 కుమార్చాలని డిమాండ్ చేశారు.

25 కులాలకు 50 లోపు మూడు రోస్టర్ పాయింట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్ రెడ్డి వర్గీకరణ విషయంలో మాలలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. రోస్టర్ పాయింట్ ను  సవరించకపోతే  రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలలు తగిన బుద్ధిచెబుతారని వారు హెచ్చరించారు. ఈ మాలల మహాధర్నాలో మాల సంఘాల నాయకులు తాళ్లపల్లిరవి. బి హరికృష్ణ, పచ్చ శ్రీనివాస్, డి.సర్వయ్య, పుణ్య భాను. పిల్లి సుధాకర్, బైరు రమేష్ బల్వంత్, మరాఠి మణిదీప్, చిక్కుడు వెంకట్, కొంగరి నరసింహ, ప్రదీప్, మందాల భాస్కర్, అనిల్ తో పాటు మాల సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.