16 April, 2026 | 2:00 AM

పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం

16-04-2026 12:00 AM

రోడ్లపైనే పారుతున్న మురుగు నీరు

మునిపల్లి, ఏప్రిల్ 15: మునిపల్లి మండల పరిధిలోని చీలపల్లిలో డ్రైనేజీ మురుగు నీరు పొంగి పొర్లుతోంది. మురికి కాలువలు నిండి మురుగు నీరంతా రోడ్లపైనే పారుతుంది. డ్రైనేజీ నీరు పారుతున్నా గ్రామ పాలకవర్గం, పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామంలో మురికి నీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో పాలకవర్గాలు లేనప్పుడు స్థానిక సమస్యలు అధికారులు మాత్రమే పరిష్కరించేవారు. కానీ నూతన పాలకవర్గాలు ఏర్పడినప్పటికీ ప్రజా సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నచందంగా తయారైంది. నూతన పాలకవర్గాలు ఏర్పడితే మా గ్రామ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూసినప్పటికీ వారి ఆశలు అడియాశలు అవుతున్నాయి. గ్రామంలో సమస్యలు తిష్టవేస్తే వాటి పరిష్కారానికి పంచాయతీ అధికారులు, పాలకవర్గం  దారి చూడం లేదనే  ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వేసవి కాలంలోనే ఈ మురికి నీరు చేరి పరిస్థితి ఇలా ఉంటే వచ్చే వర్షాకాలంలో తమ నివాసాల ముందు ఏ విధంగా  ఉంటుందోనని  గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. గ్రామంలో ఎప్పుడో వేసిన మురికి కాలువలు తప్ప కొత్తగా నిర్మించిన దాఖలు లేవు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేనందున మురికి కాలువల్లో నిండిన నీరంతా బయటకు వచ్చి దుర్వాసన  వెదజల్లుతున్నది. ఇప్పటికైనా  సంబంధిత అధికారులు, పాలకవర్గం స్పందించి ఈ మురికి కాలువ నిర్మాణ పనులు త్వరగా చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.