16 April, 2026 | 2:00 AM

‘నార్ముల్ మదర్ డెయిరీ’లో విచారణ షురూ..

16-04-2026 12:00 AM

 17 ప్రశ్నలకు సంజాయిషీ ఇవ్వాలంటూ విచారణ పత్రం 

ఎల్బీనగర్, ఏప్రిల్ 15 : మదర్ డెయిరీలో జరిగిన అవినీతిపై జిల్లా అధికారులు విచారణ చేపట్టారు.  హయత్నగర్లోని నార్ముల్ మదర్ డెయిరీ ప్రధాన కార్యాలయంలో జిల్లా సహకార అధికారి (డీసీవో) సుధాకర్ బుధవారం తనిఖీలు చేపట్టారు. మదర్ డెయిరీ నష్టాలు, పాలకవర్గం, మాజీ చైర్మన్లు, ఎండీలపై వస్తున్న అవినీతి ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే.

అందులో భాగంగా ప్రస్తుత చైర్మన్, మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఎండీలు ఇలా మొత్తం 42 మందికి ఈ నెల 15 నుంచి 23 వరకు విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా ఇచ్చారు. బుధవారం విచారణ ప్రారంభించిన డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ సుధాకర్ డెయిరీలోని ఆయా విభాగాలను తనిఖీ చేశారు. కీలక అధికారులను ప్రశ్నించారు.

విచారణలో భాగంగా నార్ముల్ మదర్ డెయిరీ నష్టాలు, అప్పులు, తదితర విషయాలపై  17 ప్రశ్నలతో కూడిన సంజాయిషీ పేపర్లు ఇచ్చి.. సమయంలోగా సమాధానాలు చెప్పాలని ఆదేశించారు. మాజీ చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఎండీలకు వేరు వేరు ప్రశ్నావళిని రూపొందించారు. మరో 3 రోజుల పాటు 42 మందిని ప్రశ్నించి వారికి ప్రశ్నావళి పేపర్లను అందిస్తారు. అనంతరం పూర్తి నివేదికను ఈ నెల 23 తర్వాత ప్రభుత్వానికి సమర్పించనున్నారు.