14 July, 2026 | 11:38 PM

మహిళా ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపులు

09-06-2024 02:08 AM
  • గండిపేట్ సీబీఐటీ కళాశాలలో ఘటన

చర్యలు తీసుకోవాలంటూ సిబ్బంది ఆందోళన

మీడియాను అనుమతించని యాజమాన్యం

రాజేంద్రనగర్, జూన్ 8 : విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన ప్రొఫెసర్లే సహోద్యోగులపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. గండిపేట్‌లోని ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల సీబీఐటీలో ఈ ఘటన చోటుచేసు కుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీబీఐటీలో గత 23 సంవత్సరాలుగా పని చేస్తున్న మహిళా ప్రొఫెసర్‌ను ఐక్యూసీఏ డైరెక్టర్లు సుశాంత్‌బాబు, త్రివిక్రమ్‌రావులు గత మూడు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారు.

ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ నరసింహులుకు ఫిర్యాదు చేయగా.. ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఇలాంటి వేధింపులు సాధారణమేనని తేలికగా కొట్టిపారంటూ సదరు మహిళా ప్రొఫెసర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న సహోద్యోగులు ఆమెకు అండగా నిలిచి, న్యాయం చేయాలంటూ కళాశాల ఆవరణలో ధర్నాకు దిగారు. ప్రిన్సిపల్ ఛాంబర్ ముందు పడుకొని నిరసన తెలియజేశారు. అయితే, కళాశాల ప్రిన్సిపల్ ఉద్యోగుల ధర్నాపై స్పందించకుండా సమస్య పట్ల అవహేళనగా మాట్లాడారని బోధన, బోధనేతర సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు సంజీవ్ ఆరోపించారు.

కళాశాలలో మహిళలపై లైంగిక ఆరోపణలు కొత్త కాదని, గతంలో కూడా పలువురు మహిళా ప్రొఫెసర్లు, లెక్చరర్లపై ఇలాంటి వేధింపులు జరిగాయని, అనేక మంది పరువు పోతుందని మౌనంగా ఉన్నారని ఉద్యోగులు వాపోయారు. కళాశాల యాజమాన్యం లైంగిక వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకొని, మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఆందోళనను కవర్ చేసేందుకు ప్రయత్నించిన మీడియా సిబ్బందితో సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా మాట్లాడుతూ కళాశాల నుంచి బయటకు పంపి గేటుకు తాళం వేశారు.