‘నీట్’పై విచారణ అవసరం
బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ డిమాండ్
హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): నీట్ పరీక్షలో అవకతవకలపై హైలెవల్ ఎక్స్‌పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్రం వెంటనే స్పందించాలన్నారు. లక్షలాది మంది వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ పరీక్షకు సంబంధించిన కొన్ని వ్యవహారాలను చూస్తూంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు.
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం నీట్ పరీక్షలో 67 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులతో ఫస్ట్‌ర్యాంక్ సాధించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనికి తోడు ఈసారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్‌లో మార్కింగ్ విధానం ఉంటుందని, ఈ విధమైన మార్కులు రావటం అసాధ్యమన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెబుతున్నారని, కొంతమంది విద్యార్థులకు ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు వచ్చినట్లు తెలుస్తోందన్నారు. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంబించారనేది చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
కొత్తగా ఏర్పడిన ఎన్డీయే సర్కార్ రానున్న రోజుల్లో ఇలాంటి సమస్యలకు సంబంధించి చాలా సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. ఈ సందర్భంగా నీట్ పరీక్ష విషయంలో బీఆర్‌ఎస్ తరుఫున పలు ప్రశ్నలతో ముందుంచారు. గత 5 ఏళ్లలో తెలంగాణ నుంచి ఏ విద్యార్థి కూడా నీట్‌లో టాప్ 5 ర్యాకింగ్‌లో లేరు. దీనికి కచ్చితంగా నీట్ ఎగ్జామ్‌లో జరుగుతున్న అక్రమాలే కారణమని నమ్ముతున్నామన్నారు. గ్రేస్ మార్కుల కేటాయింపుల కోసం అనుసరించిన విధానం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రామాణిక పద్ధతిలో ప్రతి విద్యార్థికీ మేలు చేసేలా ఈ విధానం ఉండాలన్నారు.






